వైసిపి సభ్యులు టార్గెట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే..: పయ్యావుల కేశవ్ సంచలనం
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాాయి. అయితే సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసిపి సభ్యులు టార్గెట్ చేసినట్లుగా వ్యవహరించారని పయ్యావుల కేశవ్ తెలిపారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమే గందరగోళం మద్య జరిగింది. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అరెస్ట్ ను వైసిపి కక్షపూరితంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించిందని ఆరోపిస్తూ టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమవగానే చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టుబడుతూ టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించకపోవడంతో ఆయన పోడియంను చుట్టుముట్టి టిడిపి సభ్యుల ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం మద్య సభ నడిపే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ కొద్దిసేపు వాయిదా చేసారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రియాక్ట్ అయ్యారు. వైసిపి ఎమ్మెల్యేలంతా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసారని అన్నారు. తమ నాయకుడి అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే వైసిపి సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసారన్నారు. కానీ టిడిపి సభ్యులు వారి ట్రాప్ లో పడలేరన్నారు. సభలో హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేసారు.
ఇదిలావుంటే టిడిపి ఆందోళనల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరును తప్పుబట్టారు. వైసిపి నుండి టిడిపి వైపు వెళ్లిన సభ్యులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడని... స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ప్రయత్నించాడంటే కోటంరెడ్డిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసిపి సభ్యులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని... సభలో అవాంఛనీయ ఘటనలు జరగాలని చూస్తున్నారని మంత్రి అన్నారు. స్పీకర్ పై పేపర్లు విసరడమే కాదు ఆయన కుర్చీవద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని... చివరకు స్పీకర్ పై బౌతిక దాడికి ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు.
Video అసెంబ్లీలో టిడిపి, వైసిపి ఓవరాక్షన్... పక్కున నవ్వుకున్న మహిళా ఎమ్మెల్యేలు
అంబటి మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ మీసం తిప్పడంతో సభలో మరింత గందరగోళం ఏర్పడింది. ఇలాంటివి సినిమాల్లో చేసుకోవాలి... సభలో కాదంటూ అంబటి హెచ్చరించారు. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ బాలకృష్ణకు ఛాలెంజ్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.
ఇదిలావుంటే వాయిదా తర్వాత సభ ప్రారంభమైనా టిడిపి సభ్యులు ఆందోళనను కొనసాగించారు. దీంతో కోటంరెడ్డి, పయ్యావుల, అనగాని సత్యప్రసాద్ లను మొత్తం సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ మిగతా టిడిపి సభ్యులను ఇవాళ ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.