సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ రోజు రోజుకి పుంజుకుంటుంది. ఒక్కరొక్కరుగా జనసేన పార్టీలోకి చేరుతున్నారు. ఇటీవలే చిరంజీవి అభిమాన సంఘంలోని సభ్యులంతా జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. వైసీపీకి చెందిన ఓ కీలక నేత జనసేనలో చేరారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత విడివాడ రామ చంద్రరావు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రామచంద్రరావు గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున టిక్కెట్‌ ఆశించారు. ఆ ఉద్దేశంతోనే నియోజక వర్గంలో విస్తృతంగా తిరిగారు. 

తరువాత టిక్కెట్‌ దక్కకపోవడం, పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం జనసేనలో స్పష్టమైన హామీ లభించింద నే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు తెరచాటునున్న విడివాడ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు రూపొందించు కున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్‌కల్యాణ్‌ను సీఎంను చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పని చేయాలని విడివాడ రామచంద్రరావు అన్నారు. సోమవారం తణుకు రూరల్‌ మండలం మండపాక గ్రామంలోని తన నివాసం నుంచి జనసేన కార్యకర్తలతో భారీ బైక్‌ర్యాలీ కూడా నిర్వహించారు.