ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారు. ప్రజా వేదికలో ఉన్న చంద్రబాబు సామాగ్రిని వైసీపీ నేతలు బయటకు విసిరేయడం గమనార్హం. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఇలా చేయడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా... అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రజా వేదకలో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని భావించారు.  తొలుత సెక్రటేరియట్ లోని ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో నిర్మించాలని భావించారు.తర్వాత నిర్ణయాన్ని మార్చుకొని ప్రజావేధికలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రజావేదిక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాస ప్రాంగణం పక్కనే ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజావేదిక భవనాన్ని వాడుకునేందుకు తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కొన్ని రోజుల కిందట లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. 

తాజాగా కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ల సదస్సు కోసం ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రజా వేదికలో ఉన్న చంద్రబాబు వ్యక్తిగత సామాగ్రిని అధికారులు బయటపడేశారు. కనీసం సమాచారం ఇవ్వలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ముందే సమాచారం ఇస్తే తామే ఆ సామాగ్రిని అక్కడి నుంచి తీసేసేవాళ్లమని టీడీపీ నేతలు వాపోతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.