అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సంబంధాలు అంటగట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాపు నేస్తంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు నేత ముద్రగడ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

కాపు నేస్తం ద్వారా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాటవేసే ఎత్తుగడను అనుసరిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు శనివారంనాడు భగ్గుమన్నారు. వైసీపీలోని కాపు నాయకులే ఆయనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి కన్నబాబు సహా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. 

కాపులకు తమ ప్రభుత్వం చేసిన మేలును ప్రస్తావిస్తూ వారు పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను పవన్ కల్యాణ్ కోల్పోయారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తన పాలనలో కాపుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అడిగారు. కాపులకు వైసీపీ ప్రభుత్వం చేసిన మలేుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ చంద్రబాబు హయాంలో అలా ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. 

ముద్రగడ పద్మనాబాన్ని అరెస్టు చేయించి, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినప్పుడు కాపు పెద్దలమందరం మీడియా ముందుకు వచ్చామని గుర్తు చేస్తూ ఆ రోజు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని అంబటి రాంబాబు అడిగారు. 

అంబటి రాంబాబు పద్ధతిలోనే మంత్రి కన్నబాబు కూడా పవన్ కల్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గతంలో కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారని ఆయన గుర్తు చేసారు. 

ఉద్యమంలో పాల్గొన్న మహిళలను బూతులు తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని, ముద్రగ కుటుంబ సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం అవమానించిందని అంటూ ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని అడిగారు. చంద్రబాబు హయాంలో పవన్ కల్యాణ్ కు కళ్లు కనిపించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

కాపులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారని, ముద్రగడ పద్మనాభాన్ని లాఠీలతో కుళ్లబొడిచి ఆయన భార్యను, కుమారుడిని బండబూతులు తిట్టారని, వారిని నిర్బంధించారని, ఆ సమయంలో పవన్ కల్యాణ్ నోరు విప్పలేదని, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.