ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  పేదవారిని మోసం చేయడంలో చంద్రబాబు విజయం సాధించారని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  టీడీపీ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు.

పేదవారికి విద్య అందని ద్రాక్షగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను నారాయణ, శ్రీ చైతన్యలకు కట్టబెట్టారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై ఏనాడు స్పందించలేదన్నారు. ఎన్నికలు మరో 6నెలల్లో జరుగుతతాయనగానే.. ఎస్టీని మంత్రిగా చేశారు అంటూ విమర్శించారు.

ఇంటికో ఉద్యోగం అని ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తమ అధినేత జగన్ పై దాడి చేయించింది కూడా చంద్రబాబేనని ఆరోపించారు. ఈ ఘటనలో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే డీజీపీ ప్రకటనపై తమకు వివరణ కావాలన్నారు. జగన్ కి ప్రజలే రక్షణగా ఉండాలని ప్రజలను ఈ సందర్భంగా ఆయన కోరారు.