పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే వైసీపీకి ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయన్నారు ఆ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏకగ్రీవాలు అసహజమైనవేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీపై ప్రజలు మరోసారి విశ్వాసాన్ని చూపారని సజ్జల వెల్లడించారు. విపక్షాలే రోజుకో మాట మాట్లాడుతున్నాయని.. ఒకప్పుడు ఎస్ఈసీని ఆకాశానికి ఎత్తినవాళ్లే ఇప్పుడు మారిపోయాడని అంటున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read:నామినేషన్ల విత్ డ్రాకు ముగిసిన గడువు: వైసీపీ ఏకగ్రీవాల జోరు.. క్యాంప్‌లకు తెరదీసిన టీడీపీ

ఎస్ఈసీ అవకాశమిచ్చినా టీడీపీ నుంచి పోటీ చేసుందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు మీద ఎవరికీ నమ్మకం లేదని.. ప్రజల ఆకాంక్షలు తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సజ్జల స్పష్టం చేశారు.

ఆర్ధిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమే ఈ ఫలితాలని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీకి ముందే తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.

కోవిడ్‌ను బూచిగా చూపి ఎన్నికలను వాయిదా వేయించారని ఎద్దేవా చేశారు. రీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశమివ్వడం అధికార దుర్వినియోగమేనని.. ఇంత చేసినా నామినేషన్లు వేసేందుకు టీడీపీకి నాయకులు లేరని సజ్జల పేర్కొన్నారు.

40 ఏళ్ల చరిత్ర వున్న టీడీపీ నేతలను క్యాంపులకు తరలించడం ఎందుకు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మపరీశీలన చేసుకోవాలని సజ్జల హితవు పలికారు.