ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇప్పటికే పుంగనూరు, మాచర్ల మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లో 31 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక అభ్యర్ధులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ నానా తంటాలు పడుతోంది.

ఇందుకోసం ఏకంగా క్యాంప్‌లే పెడుతోంది. కళ్యాణదుర్గం అభ్యర్ధులను ఏకంగా బెంగళూరుకు తరలించింది. చివరి నిమిషంలో వైసీపీలోకి తమ అభ్యర్ధులు చేరిపోతుండటంతో టీడీపీ ఇబ్బందులు పడుతోంది.

అనంతపురం 5వ వార్డు టీడీపీ అభ్యర్ధి ప్రసన్న లక్ష్మీ వైసీపీలో చేరింది. నిన్న ఒక్కరోజే 222 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. అటు రెబల్స్‌ను బుజ్జగించడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది.

అటు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధిక చోట ఉపసంహరణల తర్వాత అధికార పార్టీకి చెందిన సింగిల్ నామినేషన్‌లు మిగిలాయి. సాయంత్రం ఏకగ్రీవాలపై ఈసీ ప్రకటన చేసే అవకాశం వుంది.