విజయవాడ ఎంపీ కేశినేని నానికి వైసీపీ నేత పీవీపీ షాకిచ్చారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ... కేశినేని నానికి పీవీపీ లీగల్ నోటీసులు పంపించారు. తనను కేశినేని ఆర్థిక నేరస్థుడు అని అన్నాడని ఈ సందర్భంగా పీవీపీ పేర్కొన్నారు.

‘‘ నేను నేరస్వభాగం  కలిగిన వాడినని  కేశినేని అన్నారు. దేశంలోనే కాదు ఎక్కడా నాపై కేసులు లేవు. నిరాధార ఆరోపణలు చేసి నాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. పనామా పేపర్లలో నా పేరు ఉందంటూ ప్రచారం చేశారు. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్పాలి. లేదంటే క్షమాపణలు చెప్పాలి’’ అని పీవీపీ తాను పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పీవీపీ స్పందించారు. ఆ నోటీసులను జత చేసి ట్విట్టర్ లో... ‘‘ ‘కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను’అన్నారు. మరి ఈ నోటీసులపై కేశినేని ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా...రెండు రోజుల క్రితం కేశినేని నాని, బుద్ధా వెంకన్నలు సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్ పై కూడా పీవీపీ స్పందించారు. ‘‘ ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టర్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తారా.. ఏది ఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము’’ అంటూ పీవీపీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.