- Home
- Andhra Pradesh
- ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి, వైసీపీపై అనుమానాలు.. నిష్పక్షపాత విచారణ జరగాలి.. చంద్రబాబునాయుడు
ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి, వైసీపీపై అనుమానాలు.. నిష్పక్షపాత విచారణ జరగాలి.. చంద్రబాబునాయుడు
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

తూర్పు గోదావరి : జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని గట్టిగా కోరుతున్నానన్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి చెందడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. శ్యామ్ అనే ఆ వీరాభిమాని ఉరివేసుకుని చనిపోయినట్లుగా ఫోటోలు వెలుగు చూశాయి. అయితే, అతని మృతిపై ఎన్టీఆర్ అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యాం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కొప్పిగుంట. అతను చనిపోయింది చింతలూరులో. ఉరి వేసుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనేమో అనిపిస్తుంది.
శ్యామ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా.. ఏదైనా కారణంతో అతడిని చంపేసి ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానించేలా ఆ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా శ్యాం కుటుంబానికి మద్దతుగా నిలబడుతున్నారు. శ్యాం మృతి మీద దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వెలుగులోకి వచ్చిన శ్యామ్ మృతి ఫోటోలో అతని కాళ్లు భూమిపైన ఆని ఉన్నాయి. శ్యామ్ నిజంగానే ఉరి వేసుకుని చనిపోతే అతని కాళ్లు భూమిమీద ఎందుకు ఉంటాయి. మెడ దగ్గర ఉరి వేసుకున్న ఆనవాళ్లు ఎందుకు లేవు? ముఖం, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉన్నాయి? చేతి దగ్గర ఎవరో కోసినట్లుగా ఎందుకు కనిపిస్తోంది? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
‘వి వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ ట్వీట్ చేరేవరకు షేర్ చేయమంటూ కొంతమంది షేర్లు, ట్వీట్లు, రీ ట్వీట్లు కొడుతున్నారు. విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరితే అతను వారాహి యాత్రలో దీని మీద మాట్లాడతారని.. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని వారు అంటున్నారు.
శ్యామ్.. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. విశ్వక్సేన్ నటించిన దాస్కా దమ్ కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చిన సమయంలో.. సెక్యూరిటీని దాటుకుని స్టేజి మీదికి వెళ్లాడు. ఆ సమయంలో సెక్యూరిటీ అతడిని పక్కకు తోసేయబోతుంటే ఎన్టీఆర్ వారిని వారించాడు. అతనితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోలు, వీడియోలు శ్యాం మృతి నేపథ్యంలో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.