గుంటూరు జిల్లా గురజాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాసు మహేశ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పిడుగురాళ్ల పురపాలక సంఘం కొద్దిరోజుల క్రితం ఇంటి పన్నులను పెంచింది.. దీనిని నిరసిస్తూ వైసీపీ నేతలు ఇవాళ నిరసనకు సిద్ధమయ్యారు. పోలీసులకు దీనిపై ముందస్తు సమాచారం ఉండటంతో అర్థరాత్రి నుంచే పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రారంభించారు.

పోలీసుల చర్యపై వైసీపీ మండిపడింది.. నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కు అనీ.. దానిని తెలుగుదేశం ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు పెంచడంతో పాటు వేసిన రోడ్లకే మరోసారి టెండర్ పిలుస్తున్నారని అందుకే తాము నిరసనకు సిద్ధమయ్యామని వైసీపీ నేతలు తెలిపారు.