దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్.
విశాఖపట్నం : విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీకి దూరం కానుంది. జనసేన, టీడీపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం. గుడివాడ అమర్నాథ్ తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలా? జనసేనలో చేరాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో పవన్ దాడి వీరభద్రరావును జనసేనలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని వినిపిస్తోంది.
గతంలో తెలుగు దేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్ కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓటమి పాలయ్యారు.
ఆ తరువాత పార్టీ వారిని పక్కన పెట్టింది. దాడి వీరభద్రరావు కూడా మౌనంగానే ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన ఇప్పుడు జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ సారి పవన్ కల్యాణ్ దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటి అయ్యి, సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పడది స్పష్టం కానుంది.
