అధికారం చేతిలో ఉంది కదా అని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు.  ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. నిందితుడు అధికార వైసీపీ కి చెందిన వాడు కావడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం తగ్గు వారిపల్లిలో వైసీపీ నేత మోసానికి పాల్పడ్డాడు.  వైసీపీ నాయకుడు సురేంద్ర ఇంటి జాగాలు ఇప్పిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వారికి భూములు ఇప్పించకుండా తన చుట్టూ తిప్పుకునేవాడు. డబ్బులు మాత్రం వసూలు చేసి.. వారికి తగిన న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేశాడు. బాధితులు ఎంత మొత్తుకున్నా.. భూమి మాత్రం ఇవ్వలేదు. 

 దీంతో బాధితులు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు వైసీపీ నేతపై ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే పార్టీ నుంచి సురేంద్రను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు చేశారు. చిత్తూరు పార్లమెంట్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా సురేంద్ర బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.