ఓ మైనర్ బాలికతో వైసిపి నేత, గ్రామ ఉపసర్పంచ్ అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది, 

మాచర్ల : ఆయన అధికార పార్టీ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ కూడా. ప్రజాప్రతినిధిగా గ్రామస్తులకు అండగా వుండాల్సిన వాడే అమానుషంగా వ్యవహరిస్తున్నాడు. చేతిలో అధికారం వుందికదా అని పాతకక్షలను బయటకు తీసి దాడులకు తెగబడుతున్నాడు. ఇలా ఓ కుటుంబంపై దాడిచేసిన ఉపసర్పంచ్ మైనర్ బాలికతో అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. గుండెలపై తన్ని, జుట్టిపట్టి రోడ్డుపైకి ఈడ్చి బాలికను హింసించాడు సదరు ప్రజాప్రతినిధి. ఈ దారుణం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. 

బాధిత బాలిక, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని బోదలవీడు గ్రామానికి వైసిపి నాయకుడు నంబూరి కృష్ణమూర్తి ఉపసర్పంచ్ గా కొనసాగుతున్నాడు. అయితే అతడికి అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో పాతకక్షలు వున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆ కుటుంబంపై ఉపసర్పంచ్ వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా వారి ఇంటికి వెళ్లిమరీ దాడికి దిగాడు కృష్ణమూర్తి. 

వీడియో

తల్లిదండ్రులపై దాడిచేస్తున్న కృష్ణమూర్తిని మైనర్ బాలిక అడ్డుకోడానికి ప్రయత్నించింది. దీంతో బాలికను గుండెలపై తన్ని, కర్రలతో చితబాదాడు. నేలపై పడిపోయిన ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బజారులోకి లాక్కొచ్చాడు.ఇలా దారుణంగా హిసించడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి ఉపసర్పంచ్ కృష్ణమూర్తి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు బాలికను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. 

Read More బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి.. 15 యేళ్లు జైలు, రూ.50 జరిమానా...

బాలిక పరిస్థితి కాస్త మెరుగుపడిన తర్వాత ఆమెపై దాడిచేసిన ఉపసర్పంచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు తల్లిదండ్రులు. దీంతో బాలిక నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ కుటుంబంపై కక్షతో ఇంటిపైకి వచ్చి దాడి చేయడమే కాదు కూతురిని హాస్పిటల్ పాలు చేసిన నంబూరి కృష్ణమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.