ప్రత్యేకహోదా నినాదంతో రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలతో గురువారం హోరెత్తిపోయింది. ప్రత్యేకహోదా సాధనలో భాగంగా ఈరోజు జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా పరిషత్ కార్యాలయాలు, మండల కార్యాలయల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేయాలన్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో నేతలు, కార్యకర్తలందరూ ఉదయం నుండి రోడ్లపైకి చేరుకున్నారు. నిరసన కార్యక్రమం విజయవంతం అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఈరోజు పాదయాత్రకు కూడా బ్రేక్ ఇచ్చారు.

100 రోజుల పాదయాత్రను పూర్తి చేసిన జగన్‌ తాను విడిది చేసిన శిబిరం నుంచే ధర్నా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బడ్జెట్‌ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా సాధన కోసం గట్టిగా పోరాటం చేసి, కేంద్రం ప్రత్యేకహోదా ప్రకటించక పోతే ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

అంతకు ముందు ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఒక రోజు ధర్నా కూడా చేయబోతున్నారు. 5వ తేదీ ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మార్చి 3వ తేదీన జగన్‌ విడిది చేసిన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు వద్దకు వెళ్లి ఆయనను కలుసుకుంటారు. అక్కడ నుంచి ఆయన వారి వాహనాలకు జెండా ఊపిన తరువాత ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

ఈ లోపుగా ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలను జాగృతం చేయడానికి, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ఈరోజు భారీ ఎత్తున ధర్నాలు చేశారు. ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, అసెంబ్లీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికే హోదా సాధన ప్రాధాన్యతను గుర్తించిన సాధారణ విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. వైసిపికి మద్దతుగా చాలా చోట్ల వామపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు.