నూతన పీఆర్సీ ప్రకారం  వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న ట్రెజరీ అధికారులకు జగన్ ప్రభుత్వం చార్జ్ మెమోలు జారీ చేసింది.  

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేలా వున్న పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే కొత్త జీతాలను ఇవ్వాలన్న నిర్ణయానికే కట్టుబడి వుంది.

ఈ క్రమంలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది. ఇటీవల ప్రకటించిన పీఆర్పీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశిస్తుంటే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రాసెస్ చేయవద్దని కోరుతున్నాయి. ఈ క్రమంలో మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ట్రెజరీ ఉద్యోగులు పంతానికి పోవడంతో సర్కార్ సీరియస్ అయ్యింది. వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న అధికారులకు ప్రభుత్వం చార్జ్ మెమోలు జారీ చేసింది. 

చార్జ్ మొమోలు జారీ అయిన అధికారులు వీరే:

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎస్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీచేసారు. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు చెందిన ముగ్గురు డిడి లతో పాటు వివిధ జిల్లాలకు చెందిన 21 మంది సబ్ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏ టి ఓ లకు ఛార్జ్ మెమోలు జారీ అయ్యాయి. నూతన పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకు వీరికి మెమోలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే ట్రెజరీ అధికారులకు ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. లాగిన్‌లో ఉన్న వేతన బిల్లులు అన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించింది. ఇవాళ(సోమవారం) సాయంత్రం లోపు వేతన బిల్లులు అన్నింటినీ ప్రాసెస్ చేయాలని పేర్కొంది.

ప్రస్తుతం పోలీస్, న్యాయ శాఖల ఉద్యోగుల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేస్తున్నారు. పదవ పీఆర్సీ ప్రకారం కొత్త సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయలేకపోతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఇప్పటివరకు కేవలం 25% బిల్లులు మాత్రమే ట్రెజరీకి వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఓవైపు ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వడానికి సిద్దపడగా ట్రెజరీ అధికారులు అందుకు సహకరించలేదు. దీంతో కొద్దిరోజులుగా తమ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తూనే ఉంది. తాజాగా వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది ఆర్ధిక శాఖ. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీఓలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ చార్జ్ మెమోలు జారీ చేసింది.

2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.