కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి పూర్తి మెజారిటీ వచ్చినట్లే. తీర్మానం నోటీసు ఇవ్వటానికి ఒక్క ఎంపి అయినా సరిపోతారన్న విషయం తెలిసిందే. కాకపోతే తీర్మానం సభలో చర్చకు రావాలంటే సభలోని సభ్యుల బలంలో 10 శాతం మంది మద్దతు అవసరం. ఆ మద్దతు కోసమే జగన్ ఇంతకాలం చంద్రబాబునాయుడును కోరుతున్నారు.

అవిశ్వాస తీర్మానంపై ఇంతకాలం జగన్ ను అవహేళనగా, చులకనగా మాట్లాడిన చంద్రబాబు వేరేదారి లేక జగన్ కు మద్దతు పలికారు. అయితే, నిజానికి చంద్రబాబు మద్దతు ఇస్తారని జగన్ కూడా ఊహించలేదు. అందుకనే కాంగ్రెస్, టిఎంసి, టిఆర్ఎస్, బిజెడి, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల అధినేతలతో టచ్ లోకి వెళ్ళారు. వాళ్ళు కూడా మద్దతుపై సానుకూలంగానే స్పందించారట. అందుకనే టిడిపితో సంబంధం లేకుండానే అవిశ్వాస తీర్మానం నోటీసుపై వైసిపి ముందుకెళ్ళింది.

తన ప్రమేయం లేకుండానే జగన్ చొచ్చుకుపోతుండటాన్ని గమనించిన చంద్రబాబు కూడా చివరకు జగన్ కే జై కొట్టారు. దాంతో అవసరమైనదానికన్నా ఎక్కువమంది ఎంపిల మద్దతే వైపిపికి వచ్చింది. అందుకనే గురువారమే మధ్యాహ్నమే వైసిపి పార్లమెంటు సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చేశారు. సరే, అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వస్తుందా? వస్తే ఏమవుతుంది? అన్నది వేరే సంగతి. మొత్తానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టటంలో జగన్ సక్సెస్ అయినట్లే.