హైదరాబాద్: ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తాను అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని వైసీపీ వ్యవస్థాపకుడు కె.శివకుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. 

తనను అకారణంగా సస్పెండ్ చెయ్యడంతోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు దుష్యంత్ రెడ్డి తనను సంప్రదించారని చెప్పుకొచ్చారు. దుష్యంత్ రెడ్డి తనను జగన్ కు పరిచయం చేశారని తెలిపారు. 

కలిసి పనిచేద్దాం, పార్టీ ఇవ్వమని వైఎస్ జగన్, సజ్జల అడిగారని చెప్పారు. ఆసమయంలో వైఎస్ జగన్ ను అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఎవరి మనోభావాలను లెక్క చెయ్యకుండా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. 

వ్యవస్థాపక నియమాలు పాటించకుండా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అందువల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే పార్టీ గుర్తును ఫ్రీజ్ చెయ్యాలని సుప్రీం కోర్టుకు వెళ్తానని పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ తేల్చి చెప్పారు. 

మెున్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా శివకుమార్ వ్యవహరించారు. పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ కొనసాగుతున్నారు. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకే నని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. 

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంపై వైఎస్ జగన్ ఆగ్రహానికి గురైన శివకుమార్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు. పార్టీలో చర్చించకుండా శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, పత్రికా ప్రకటన విడుదల చెయ్యడాన్ని ఖండిస్తూ ఆయనను బహిష్కరించారు. 

ఈ బహిష్కరణపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనరల్ సెక్రటరీగా మద్దతు పలికానని అందులో తప్పేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేయాలని లేనిపక్షంలో వైసీపీ నుంచి వైఎస్ జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు శివకుమార్. తాను పెట్టిన పార్టీ నుండి పొమ్మనటానికి మీరెవరు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు.