ఇద్దరి ఎంపిక చూసిన తర్వాత గట్టి అభ్యర్ధులనే జగన్ రంగంలోకి దింపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

శాసనసభ్యుల కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాలకు వైసీపీ గట్టి అభ్యర్ధులనే ఎంపిక చేసింది. పశ్చిమగోదావరి జిల్లా నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ నాని, కర్నూలు జిల్లా నుండి ఇటీవలే పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్రెడ్డి అభ్యర్ధులుగా ప్రకటించారు. గంగులను పార్టీలోకి తీసుకునేటప్పుడే ఎంఎల్సీ టిక్కెట్టు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు జరిగిన ప్రచారం దీంతో వాస్తవమైంది. ఇంతకాలం టిడిపిలో ఉన్న గంగుల కుటుంబానికి వైసీపీ నుండి టిడిపిలో చేరిన భూమా కుంటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది. దానికితోడు చంద్రబాబునాయుడు గంగులను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్లే గంగుల పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

గంగుల వైసీపీలో చేరేటప్పుడే జిల్లా వ్యాప్తంగా తన బలగంతో వచ్చేసారు. అందులో స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. దానికి తోడు ఇపుడు ఎంఎల్సీ టిక్కెట్టు కూడా ఇవ్వటంతో వైసీపీ మరింత బలోపేతమవుతుంది. దాని ప్రభావం స్ధానిక సంస్ధల కోటాలో జరుగుతున్న ఎంఎల్సీ ఎన్నికై కనబడాలి. కర్నూలు జిల్లా నుండి వైసీపీ తరపున గౌరు వెంకట్రెడ్డి పోటీ చేస్తుండగా టిడిపి తరపున శిల్పా చక్రపాణి రెడ్డి పోటీలో ఉన్నారు. పార్టీల బలాలు తీసుకున్నా, గంగుల చేరికను తీసుకున్నా వైసీపీ అభ్యర్ధి గెలవటానికే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరి ఎంపిక చూసిన తర్వాత గట్టి అభ్యర్ధులనే జగన్ రంగంలోకి దింపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.