Asianet News TeluguAsianet News Telugu

విలువలకు నిలువెత్తు రూపం

తాను మంత్రిపదవిని ఆశించి టిడిపిలో చేరలేదని కాస్త ఇబ్బందిగా చెప్పారు. తనకు మంత్రిపదవి ఇవ్వొద్దని ఎవరూ అడ్డుపడటం లేదట.

YCP defector Bhuma  says he is synonym for values

అసలు విలువలకు నిలువెత్తు ప్రతిరూపమే భూమా నాగిరెడ్డి. నైతిక విలువలకు పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే అది ఒక్క భూమాకే. ఈరోజు ఓ టివి ఛానల్లో భూమా మాట్లాడిన మాటలు విన్నవారికి ఎవరికైనా అదే అనిపిస్తుంది. బెదిరింపులు, బలవంతపు వసూళ్ళు, ఆక్రమణలు, గూండాయిజం, కబ్జాలు అంటే ఏమిటి అన్నట్లుగా ఎదురు ప్రశ్నించారు.

 

దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కొనసాగుతున్నామంటే తాము పాటిస్తున్న రాజకీయ విలువల వల్లే అని చెప్పుకున్నారు. ‘మరి విలువలకు కట్టుబడిన వారైతే వైసీపీ తరపున గెలిచి టిడిపిలో ఎందుకు చేరా’రంటే సిద్ధాంతాల కోసమని బదులిచ్చారు. మరి ఎంఎల్ఏల పదవికి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తే, తెలంగాణాలో ఏకంగా పార్టీనే టిఆర్ఎస్ లో కలిపేసిన విషయాన్ని మాత్రం ఎవరూ ఎందుకు ప్రశ్నించరంటూ అతితెలివి చూపించారు.

 

పైగా తాను పార్టీ ఫిరాయించిన తర్వాత కూడా తనను ఇంకా వైసీపీ ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ఎదురు ప్రశ్నించారు. ఎందుకంటే, తనను పార్టీ నుండి సస్పెండ్ చేసేంత దమ్ము వైసీపీకి లేదని క్యామిడిగా చెప్పారు. చంద్రబాబునాయనుడు ఎప్పుడు చెబితే అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. ఎన్నికలకు ఎప్పుడంటే అప్పుడే రెడీ అని కూడా ప్రకటించారు.

 

తాను మంత్రిపదవిని ఆశించి టిడిపిలో చేరలేదని కాస్త ఇబ్బందిగా చెప్పారు. తనకు మంత్రిపదవి ఇవ్వొద్దని ఎవరూ అడ్డుపడటం లేదట. కాకపోతే శిల్పా వర్గంతో కూర్చుని మాట్లాడుకునే పరిస్ధితులైతే లేవని మళ్ళీ భూమానే అంగీకరించారు. కర్నూలు జిల్లాలోని నేతలందరూ భూమాకు మద్దతుగా ఉన్నారట. మరి అందరూ తనకే మద్దతుగా ఉంటే శిల్పా తదితర వర్గగాలతో వివాదాలెందుకు వస్తున్నాయో భూమానే  వివరిస్తే బాగుంటుంది. టిడిపి నుండి తప్పుకోవాల్సి వస్తే రాజకీయాల నుండే విరమిస్తాను గానీ మళ్ళీ వైసీపీలో మాత్రం చేరనని ఖరాఖండిగా చెప్పారు. టిడిపిలో నుండి బయటకు వచ్చినపుడు కూడా ఇదే మాటను భూమానాగిరెడ్డి అప్పట్లో చెప్పారులేండి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios