వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట చేరుకున్నారు. బుధవారం ఇచ్చాపురంలో తన ప్రజా సంకల్పయాత్రను ముగించుకున్న జగన్ విజయనగరం నుంచి రైలులో తిరుపతి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న జగన్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరుపతి పద్మావతీ అతిథి గృహం వద్దకు ఆయన చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంటకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 ప్రాంతంలో తిరుమల చేరుకుని అక్కడి పద్మావతీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.

అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున 6 గంటలకు తిరుమల నుంచి నేరుగా కడపకు వెళతారు. మరోవైపు ప్రతిపక్షనేతగా ప్రభుత్వ మర్యాదలతో కాకుండా సాధారణ భక్తుడిలా కాలినడక భక్తులు వెళ్లే దివ్యదర్శనం క్యూలైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకుంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.