వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. గురువారం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న గవర్నర్.. గేట్ వే హోటల్‌లో బస చేశారు. ఈ సందర్భంగా జగన్‌ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.

కడప జిల్లా పర్యటన అనంతరం ఇంద్రకీలాద్రీపై దుర్గమ్మను దర్శించుకున్న జగన్ నేరుగా గేట్‌వే హోటల్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రేపటి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారు.

కాగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను అధికారులు జగన్‌కు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.