విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అచ్చంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాదిరిగానే మాట్లాడారు. జయంతికి, వర్ధంతికి మధ్య తేడా తెలియకుండా నారా లోకేష్ గతంలో మాట్లాడిన విషయం తెలిసిందే. అందుకు ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారు.

నారా లోకేష్ రీతిలోనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు. ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ద్రోణంరాజు వర్ధంతి అనాల్సి ఉండగా యార్లగడ్డ జయంతి, జన్మదినం అని మాట్లాడారు. నారా లోకేష్ మాదిరిగానే పప్పులో కాలేశారు.

పక్కనే ఉన్న ద్రోణంరాజు శ్రీనివాస్ సరి చేయడానికి ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదు. జయంతి కాదు వర్ధంతి అని చెప్పినా ఆయన వినిపించుకోకుండా మాట్లాడుతూ వెళ్లారు. 

జయంతి రోజున ముఖ్యమంత్రి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, దాంతో ద్రోణంరాజు ఆత్మ శాంతిస్తుందని ఆయన చెప్పారు. నిజమైన పుట్టినరోజు ఇది అని, యాదృచ్ఛికమే కావచ్చు గానీ విశాఖపట్నానికి ముఖ్యమంత్రి అమలు చేయడానికి ముఖ్యమంత్రి వస్తున్న రోజు ఇది అని ఆయన అన్నారు.