అమరావతి: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్టను, లౌకిక విలువలను దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. 

ఈ నెల 18వ తేీదన విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టిన రోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపించాలని దేవాదాయ శాఖ ఆదేశించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ స్వామి భక్తి కోసం ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆయన అన్నారు. దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు స్వరూపానందపై అంత ప్రేమ ఉంటే ఒక సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలని, అధికార దుర్వినియోగం చేయడం తగదని ఆయన అన్నారు. 

అధికార యంత్రాంగాన్ని ఓ ప్రైవేట్ పీఠం ముందు మోకరిల్లజేస్తున్నారని ఆయన విమర్శించారు. చినజీయర్ స్వామి, కంచి కామకోటి పీఠాధిపతిలాంటి ఇతర స్వామీజీల పుట్టిన రోజులకు లేని మర్యాదుల స్వరూపానందకు చేయడం వారందరినీ కించపరచడమేనని యనమల అన్నారు.