Asianet News TeluguAsianet News Telugu

తుగ్లక్ 2.0గా జగన్ రెడ్డి.. ఏపిలో గవర్నమెంట్ టెర్రరిజం: యనమల సంచలనం

వైసిపి పాలనలో 13జిల్లాలలో అభివృద్ది లేదని... సంక్షేమం మొత్తం ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతోందని ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు. 

Yanamala Ramakrishnudu Sensational comments on CM YS Jagan
Author
Guntur, First Published Jan 3, 2021, 1:43 PM IST

దేశంలోనే గరిష్ట అప్పులు, కనిష్ట అభివృద్ది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. అప్పుల భారం ప్రజలపై, పప్పుబెల్లాలు వైసిపి నాయకులకు అందిస్తున్నారని మండిపడ్డారు. 

''13జిల్లాలలో అభివృద్ది లేదు. సంక్షేమం  మొత్తం వైసిపి కార్యకర్తలకే. రోడ్లు, డ్రెయిన్లు తదితర ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది లేదు. విద్య, వైద్యం వంటి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది లేదు. ఉద్యోగులకు టిఏ, డిఏలు లేవు..చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు పించన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 6డిఏలు పెండింగ్ పెట్టిన చరిత్ర ఎన్నడూ లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగ్..ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలనే కుంగదీశారు'' అని విరుచుకుపడ్డారు. 

''ఫిస్కల్ డెఫిసిట్ రూ 1,10,320 కోట్లకు చేరుతోంది. అప్పులు కూడా అంతే.. ఏడాదిలోనే రూ 73,812కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. రాష్ట్ర రియల్ జిఎస్‌డిపి 7.6% పడిపోయిందని జాతీయ సగటు లెక్కలే చెప్పాయి. జిఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 37% పెరిగింది, గతం కన్నా 10% పెరిగింది(బిఈ ప్రకారం ఉండాల్సింది 27%). జిఎస్‌డిపిలో ద్రవ్యలోటు 13%కు పెరిగింది. ఎఫ్ డి 8% అధికం అయ్యింది(బిఈ ప్రకారం ఉండాల్సింది మైనస్ 5%)జిఎస్ డిపిలో రెవిన్యూ లోటు(ఆర్ డి) మైనస్ 3-4% కు చేరింది. గత ఏడాది ఫస్ట్ హాఫ్ ఇయర్ కన్నా ఈ ఏడాది తొలి 6నెలల్లో రెవిన్యూ వసూళ్లు 6% పెరిగాయి. అప్పులు రెట్టింపు చేశారు. ఖర్చులు 23% అదనంగా చేశారు'' అంటూ గణాంకాలు గుర్తుచేశారు. 

''రాష్ట్రానికి కేంద్రసాయం రూ7,700కోట్లు అదనంగా అందింది. కరోనా నివారణకు అదనపు సాయం అందింది. ఎక్సైజ్ డ్యూటీ 100% పైగా పెరిగింది. ప్రజలపై ఎడాపెడా పన్నులు, సుంకాలు విధించారు. 19నెలల్లో రూ75వేల కోట్ల పన్నుల భారం మోపారు. ప్రతి నెలా రూ4వేల కోట్లు పన్నుల భారంతో ప్రజల నడ్డి విరిచారు. అగమ్యగోచరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారు. ఆర్ధిక నిర్వహణ చేతగాకే ఈ దుస్థితి తెచ్చారు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎక్కడికి పోయింది ఈ డబ్బంతా..?'' అని ప్రశ్నించారు.

read more  నువ్వెంత నీ బ్రతుకెంత.. నాలుక కోస్తాం: వెల్లంపల్లికి టిడిపి ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్

''ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలు చేసింది శూన్యం. వడ్డీ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలే అర్ధం చేసుకోవాలి. తలసరి ఆదాయం, తలసరి కొనుగోలు శక్తి, పొదుపు శక్తి దారుణంగా పడిపోయాయి. నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. సంక్షేమం నత్తనడకన సాగుతోంది. మార్కెట్ ధరలకు, చేసే సంక్షేమానికి పొంతనే లేదు. ఎన్నడూ లేని కష్టాల్లో ప్రజలు చిక్కుకున్నారు'' అన్నారు.

''67ఏళ్ల చరిత్రలో ఏపిలో తలసరి అప్పు మొత్తం రూ70వేలు ఉంటే, అందులో జగన్ రెడ్డి సిఎం అయ్యాక తలసరి అప్పు భారమే రూ20వేలు. 19నెలల్లో రూ20వేలు తలసరి అప్పు భారం మోపారు. తప్పుడు నిర్ణయాల్లో, ఎడాపెడా పన్నుల్లో తుగ్లక్ ను మించిపోయాడు జగన్ రెడ్డి. చేతగాని పాలనకు, అవినీతి కుంభకోణాలు తోడై ఖజానా మొత్తం దోచేశారు. జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత ప్రజల పాలిట శాపాలు అయ్యాయి. 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇలాంటి అసమర్ధ సిఎంను, అవినీతి సిఎంను చూడలేదని విశ్లేషకులే చెబుతున్నారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

''గవర్నమెంట్ టెర్రరిజంతో ఏపికి ఎనలేని చెడ్డపేరు తెచ్చారు. శాంతిభద్రతలను అధ:పాతాళానికి దిగజార్చారు. ఏపి అంటేనే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు భయపడే స్థితి తెచ్చారు. నేరగాళ్ల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారు. ప్రతిపక్షాలపై దాడులు, ప్రజలపై దౌర్జన్యాలు, ఆలయాలపై దాడులతో అల్లకల్లోలం చేశారు. ఈ దుశ్చర్యలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలి. బాధిత ప్రజానీకమే వైసిపికి గుణపాఠం చెప్పాలి'' అని యనమల సూచించారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios