అమరావతి: 5 ఏళ్లలో వైఎస్ జగన్ సర్కార్ రూ70వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ 64ఏళ్ల చరిత్రలో 1956నుంచి అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తూనే ఉన్నాయన్నారు.

2019-20నాటికి వైసిపి ప్రభుత్వం చేసిన అప్పుతో సహా (బడ్జెట్ అంకెల ప్రకారమే) ఏపి అవుట్ స్టాండింగ్ రుణాల మొత్తం రూ3,04,500కోట్లకు చేరిందని ఆయన చెప్పారు.  ఏడాదికి సగటున రూ5వేల కోట్ల లోపు అప్పు గత 64ఏళ్ళలో ఉంటే, ఈ ఒక్క ఏడాదే సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం రూ70వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆయన వివరించారు. 

 విభజన తర్వాత ఏపిలో టిడిపి ప్రభుత్వ 5ఏళ్లలో(2014-19), ఏడాదికి సగటు అప్పు రూ26వేల కోట్లు ఉందని ఆయన గుర్తు చేశారు. అదే ఒక్క ఏడాది(2019-20)లోనే దానికంటె దాదాపు 3 రెట్లు అప్పులు జగన్  ప్రభుత్వం తెచ్చిందని ఆయన తెలిపారు. 

ఏడాదికి రూ70వేల కోట్ల చొప్పున వైసిపి అయిదేళ్ల పాలనలో రూ 3,50,000కోట్ల రుణభారం అదనంగా రాష్ట్రంపై మోపుతున్నారన్నారు. పాత అప్పులు కూడా దీనికి కలిపితే 2024నాటికి మొత్తం అప్పులు రూ6,54,500కోట్లకు చేరతాయన్నారు.

ఈ ఒక్క ఏడాదిలో వైసిపి ప్రభుత్వం చేసిన అప్పు, 30ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులకు సమానమన్నారు. వైసిపి 5ఏళ్ల పాలనా అప్పులకు, 64ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పులకు సమానం కానున్నాయి. చరిత్రలో లేనంత అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోతోందన్నారు. 

వడ్డి చెల్లింపుల్లో వృద్ది, అసలు చెల్లింపుల్లో వృద్ది రెండూ కలిపితే ఏడాదికి రూ50వేల కోట్లు ఉంటుంది. వైసిపి చివరి ఏడాదిలో వడ్డీ చెల్లింపులు,అసలు చెల్లింపులకే రూ లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. 

విపరీతంగా అప్పులు చేయడం వల్ల కేవలం అప్పుల మీదే ఆధారపడటం వల్ల ఏపి క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఏపికి అప్పు కూడా దొరకని దుస్థితి ఏర్పడుతుంది.  అటు అభివృద్ది పనులను ఆపేసి, ఇటు పేదల సంక్షేమం అటకెక్కి, రాష్ట్రం దివాలా తీస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో రాష్ట్రం ఉండదు. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4డిఏలు ఇవ్వకపోగా కరోనా వంకతో వాళ్ల జీతాల్లో 50% కోతపెట్టారని ఆయన విమర్శించారు.

జిఎస్ డిపి, అప్పుల నిష్పత్తి 34.6%కు పెరిగిపోయింది, 2018-19లో టిడిపి హయాంలో 28% మాత్రమే. ఏడాదిలోనే జిఎస్ డిపి, అప్పుల అంతరం 6.6% పెరిగిపోయింది. అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో 6వ రాష్ట్రంగా ఏపి మారిందని చెప్పారు.

ఇప్పటికే డబుల్ డిజిట్ గ్రోత్ రేటునుంచి రాష్ట్రం సింగిల్ డిజిట్ కు పడిపోయింది. కరోనాకు ముందే వృద్దిరేటు 4% పడిపోయింది. కరోనా తర్వాత ఇది రెండు మూడు రెట్లు పెరిగిపోయి రాష్ట్రంలో తిరోగమన వృద్ది( నెగటివ్ గ్రోత్) నెలకొంటుందన్నారు.

రివర్స్ టెండరింగ్ లకు తోడుగా రివర్స్ గ్రోత్ తెచ్చిన సీఎంగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని యనమల రామకృష్ణుడు ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.

అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల సమతుల్యత దెబ్బతింది. కేపిటల్ ఎక్స్ పెండిచర్ లో 35% కోతలే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. తత్ఫలితంగా ఏపి అభివృద్ది అడుగంటింది, పేదల సంక్షేమం కొండెక్కిందని ఆయన ఆరోపించారు.