Asianet News Telugu

పాలించే పోస్టుల్లో సొంతోళ్లు... పాలింపబడే స్థానాల్లో బడుగులు...ఇదీ జగన్ పాలసీ: యనమల సంచలనం

రాష్ట్ర ఖజానా ఖాళీ అయి ఆర్ధిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో ఎన్నడూ లేని పదవుల్ని సైతం సృష్టించడం వెనుక ఆంతర్యమేంటి? అంటూ నామినేటెడ్ పదవుల భర్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఆర్థిక మంత్రి యనమల.  

yanamala ramakrishnudu reacts nominated posts in ap akp
Author
Amaravati, First Published Jul 18, 2021, 2:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైసీపీలో ఉన్న అసంతృప్తులను, రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడానికే ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన జగన్ రెడ్డికి ఏ కోశానా లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ... రాచరిక వ్యవస్థను విస్తరిస్తున్నారనడానికి  తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవులే నిదర్శనమని యనమల అన్నారు. 

''అధికారాలు, నిధులు ఉన్న పదవులన్నింటినీ జగన్ రెడ్డి బంధువర్గానికి పంచి... నిధులు లేని, అప్రధాన్య పోస్టుల్ని బడుగు వర్గాలకు కట్టబెట్టారు. బలహీన వర్గాలంటే ప్రభుత్వానికి ఎంత చులకన భావం ఉందో ఈ కేటాయింపుల్లో చూపిన వ్యత్యాసంతో తేలిపోయింది. పరిపాలించే స్థానాల్లో సొంత వారిని నియమించుకుని.. పరిపాలించబడే స్థానాల్లో బడుగు బలహీన వర్గాలను ఉంచారు'' అని ఆరోపించారు. 

''రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి ఖాళీ చేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో ఎన్నడూ లేని పదవుల్ని సైతం సృష్టించడం వెనుక ఆంతర్యమేంటి.? రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా నిధులు లేవంటున్నారు. ఆదాయం కోసం ఆస్తుల్ని తెగనమ్ముతున్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ అప్పులతో నడిపిస్తున్నారు. చివరికి ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులే శరణ్యమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడంలేదు. రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అందించడం లేదు. పెన్షన్ దారుల సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని పదవులు సృష్టించడం.. ప్రజలకు మేలు చేయడమా.. భారంగా మార్చడమా.? వీరందరికీ జీతాలివ్వడం కోసం ఇంకెంత అప్పులు చేస్తారు, ఎన్ని ఆస్తులు అమ్ముతారు.?'' అంటూ యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  చిట్టా రెడీ చేస్తున్నాం... వడ్డీతో సహా చెల్లిస్తాం..: వైసిపి నాయకులకు అచ్చెన్న హెచ్చరిక

''రూ.3000 చేస్తామన్న పెన్షన్ల హామీ అమలు చేయలేదు. పేదలందరికీ కట్టిస్తామన్న ఇళ్లను పట్టించుకోవడం లేదు. రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థానానికి పడిపోతోంది. సంక్షేమ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. అయినా.. దుబారాలో మాత్రం వెనకాడేదే లేదు అన్నట్లు జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం, రంగులు తీయడంతో వేల కోట్లు దుబారా చేశారు. పత్రికల్లో ప్రకటనల పేరుతో వందల కోట్లు దుబారా చేస్తున్నారు. వందల మంది సలహాదార్లను నియమించి వందల కోట్లు వేతనాలుగా చెల్లిస్తూ దుబారా చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు సహజవనరుల్ని దోచిపెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ఇప్పుడు వందలాది వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి.. ఆ పేరుతో లక్షల్లో వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు'' అని ఆరోపించారు. 

''వైసీపీ నేతలకు ప్రభుత్వ సొమ్మును దారాదత్తం చేయడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదు. రాష్ట్రంలో ఆర్ధిక నియంత్రణ గాడి తప్పింది. అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమ రంగాన్ని నీరుగార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కాకుండా.. ప్రభుత్వ దుబారాకు, నవరత్నాల పేరుతో చేస్తున్న దోపిడీకి వాడుకుంటున్నారు. ఇకపై వైసీపీ నిరుద్యోగులకు జీతాల పేరుతో ఉన్న కొద్ది పాటి నిధుల్ని కూడా ఊడ్చేసేందుకు సిద్ధమయ్యారు'' అని మండిపడ్డారు.

''బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా... ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను పక్కన పెట్టి ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సభ్యులు ఏ విధంగా ప్రకటిస్తారు.? 3లక్షకు పైగా ఉద్యోగాల ఖాళీలుంటే అరకొర పదవులు మాత్రమే భర్తీ చేస్తామనడం, అది కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటి? ఇంటిని ముట్టడిస్తామన్న నిరుద్యోగ సంఘాల ప్రకటనలను, వారి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నీచ ప్రకటనలు చేయడం హేయం. ఇది నిరుద్యోగ వ్యతిరేక విధానం కాదా.?'' అంటూ యనమల మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios