ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారంటూ  శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

రాజ్యాంగ సంక్షోభంతో రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. గవర్నర్ తనకున్న అధికారలతో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని, పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా జోక్యం చేసుకోవాలని కోరారు. 

"

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనం అనటం దేశ చరిత్రలో లేదని అన్నారు. స్థానిక పాలన అందించటంలో ప్రభుత్వం విఫలమైందని, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. 

రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని చేసిన ప్రమాణాన్ని ఉద్యోగులు, అధికారులు గుర్తుచేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వమూ  శాశ్వతం కాదని, అధికార యంత్రాగమే శాశ్వతమని వారు గ్రహించాలని హితవు పలికారు. 

ప్రభుత్వం చెప్పింది చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం తగదని, పార్లమెంట్, అసెంబ్లీ చట్టాల్ని అవమానించేలా వ్యవహరించటం బాధాకరం అని, అధికారులు, ఉద్యోగులు తమ వ్యవహారశైలిపై పునరాలోచన చేయాలని కోరారు.