Asianet News TeluguAsianet News Telugu

పులివెందుల పులకేశీ...తుపాకులతో బెదిరించమేనా మీ రాయలసీమ అభివృద్ది: యనమల ఫైర్

జగన్మోహన్ రెడ్డిది నిర్మాణాత్మక పంథా కాదు..హింసా, విధ్వంసక ప్రవృత్తి అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

Yanamala Ramakrishnudu fires on YCP Govt and cm Jagan
Author
Guntur, First Published Aug 2, 2020, 1:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: జగన్మోహన్ రెడ్డిది నిర్మాణాత్మక పంథా కాదు..హింసా, విధ్వంసక ప్రవృత్తి అని మాజీ మంత్రి, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ది కోసమే రాజధాని తరలింపు, సిఆర్‌డిఏ రద్దుగా చెప్పడం సీఎం జగన్ రాజకీయ జిమ్మిక్కులు మాత్రమేనన్నారు. జగన్ ఏడాది పాలనలో మూడు ప్రాంతాల్లో చేసిన అభివృద్ది శూన్యమన్నారు. టిడిపి చేసిన అభివృద్దిని కళ్లముందే వైసిపి ధ్వంసం చేస్తుంటే ఇక 3ప్రాంతాలను అభివృద్ది చేస్తాడని ఎలా విశ్వసిస్తారు..? అని అన్నారు. 

''అభివృద్ది చేసేవాళ్లయితే పిపిఏల జోలికి వెళ్లేవారు కాదు. ఐదు దేశాల ఎంబసీల నుంచి వార్నింగ్ లు వచ్చేవి కాదు. అభివృద్ది చేసేవాళ్లయితే కోర్టుల నుంచి 70చివాట్లు తినేవాళ్లు కాదు.  5ఏళ్లలో టిడిపి విశాఖకు పెంచిన ప్రతిష్టను 14నెలల్లోనే వైసిపి సముద్రంలో కలిపేసింది. టిడిపి విశాఖను పెట్టుబడుల గమ్యస్థానంగా, ఉపాధి కేంద్రంగా చేస్తే వైసిపి
 భూ కబ్జాదారుల గమ్యస్థానంగా మార్చింది. వాల్తేర్ క్లబ్, దసపల్లా భూములు, కార్తీకవనం, వెంకోజిపాలెం ఆశ్రమ భూములు, భోగాపురం భూముల కబ్జాలతో ల్యాండ్ గ్రాబర్స్ అడ్డాగా చెడ్డపేరు తెచ్చారు'' అని ఆరోపించారు. 

''14నెలల్లో ఉత్తరాంధ్ర 3జిల్లాలకు సీఎం జగన్ చేసిన అభివృద్ది ఏమిటి..? వైసిపి పాలనలో రాయలసీమ 4జిల్లాల్లో సాధించిన పురోగతి ఏమిటి..? విశాఖ ఫిన్ టెక్ వ్యాలీని నాశనం చేయడమా వైసిపి చేసే అభివృద్ది..? మెడ్ టెక్ జోన్ ను నిర్వీర్యం చేయడమా వైసిపి చేసే అభివృద్ది..? రూ70వేల కోట్ల అదాని డేటా సెంటర్ పోగొట్టడమా వైసిపి అభివృద్ది..? 
విశాఖలో 3సమ్మిట్ లు, ఫిన్ టెక్ ఫెస్టివల్, బ్లాక్ ఛెయిన్ కాన్ఫరెన్స్ టిడిపి నిర్వహిస్తే, మీరొచ్చాక ఒక్క పెట్టుబడుల సదస్సు పెట్టారా..?'' అంటూ ప్రశ్నించారు. 

''వైసిపి పాలనలో రాయలసీమ జిల్లాలలో ఒక్క పరిశ్రమ పెట్టారా..? పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకొచ్చారా..? వాటాలు అడిగి ఎన్ని కంపెనీలను తరిమేశారు, ఎంతమంది పారిశ్రామిక వేత్తలను బెదిరించారు..? కియా 17ఆగ్జిలరీ యూనిట్లు తరిమేసిన మీరా అభివృద్ది గురించి మాట్లాడేది..? సోలార్ ప్లాంట్ల యజమానులను తుపాకులతో బెదిరించిన మీరా రాయలసీమను అభివృద్ది చేసేది..? కాంట్రాక్ట్ ఇవ్వలేదని, వేలాది సోలార్ ప్లేట్లు ధ్వంసం చేయడమా వైసిపి అభివృద్ది..?'' అంటూ మండిపడ్డారు. 

''ప్రకాశం జిల్లాలో రూ.25వేల కోట్ల ఆసియా పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీని పోగొట్టడమేనా వైసిపి అభివృద్ది..? హీరోమోటాకార్ఫ్, ఇసుజు, అశోక్ లేలాండ్ టిడిపి తెస్తే మీరొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేగలిగారా..? తిరుపతిని మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా టిడిపి చేస్తే, మీరొచ్చాక ఒక్క మొబైల్ తయారీ కంపెనీ వచ్చిందా..? రాజధానిలో భూములు తీసుకున్న 139 సంస్థలను అమరావతి రాకుండా చేయడమేనా వైసిపి అభివృద్ది..? ఆ 139కంపెనీల్లో వచ్చే వేలాది ఉద్యోగాలను పోగొట్టడమేనా వైసిపి చేసే అభివృద్ది..?
''అంటూ ధ్వజమెత్తారు. 

read more   రాజధానిగా వైజాగ్... ఆ ప్రాంత వాసిగా నాకూ సంతోషమే: అయ్యన్నపాత్రుడు సంచలనం

''ఐదేళ్లలో టిడిపి రూ.64వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే, వైసిపి ఏడాదిలో ఖర్చు చేసింది కేవలం రూ 4వేల కోట్లు. ఇదేనా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో వైసిపి అభివృద్ది..? 
రాయలసీమలో మచ్చుమర్రి, పులకుర్తి, మారాల, పెన్నా అహోబిలం, చెర్లోపల్లి, గోరుకల్లు, పైడిపాలెం, గండికోట సిబిఆర్ లిఫ్ట్, చిత్రావతి, అడవిపల్లి రిజర్వాయర్ల పనులన్నీ టిడిపి పూర్తిచేస్తే మీరు వచ్చి ఏం చేశారు. 14నెలల్లో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా..?అభివృద్ది గురించి వైసిపి నేతలు మాట్లాడటం, దయ్యాలు వేదాలు వల్లించడమే'' అన్నారు. 

''టిడిపి హయాంలో 10లక్షల ఇళ్ల నిర్మాణం, లక్షలాది ఇళ్ల పట్టాల పంపిణీ చేసినా ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవు. అదే ఇప్పుడు ఇళ్లస్థలాలకు భూసేకరణలో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతి, మెరక పేరుతో రూ.3వేల కోట్ల అవినీతి, ఒక్కో పట్టాకు రూ.60వేల నుంచి రూ లక్షా 10వేల వసూళ్లు వైసిపి సాధించిన అభివృద్దా..?
రూ 36వేల కోట్ల నరేగా నిధులతో టిడిపి 26వేల కిమీ సిమెంట్ రోడ్లు నిర్మిస్తే, నరేగా నిధులు రూ3వేల కోట్లు ల్యాండ్ లెవలింగ్ పేరుతో స్వాహా చేయడమా వైసిపి అభివృద్ది..?'' అని విమర్శించారు. 

''టిడిపి శిలాఫలకాలు ధ్వంసం చేయడం, టిడిపి కట్టిన ఇళ్లు పాడుబెట్టడం, రాజధాని అమరావతి 3ముక్కలు చేయడం, ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం, పరిశ్రమలను తరిమేయడం, దళితులపై దాడులు, దౌర్జన్యాలు, బిసిలపై తప్పుడు కేసులు...ఇవేనా వైసిపి అభివృద్ధి కార్యక్రమాలు. అవినీతిపరుల పాలనలో ముఠాకోరుల(క్లిప్టోక్రాటిక్ గ్యాంగ్ స్టర్స్) చేతిలో 3ప్రాంతాల అభివృద్ది ఏవిధంగా సాధ్యం..?'' అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

''3ప్రాంతాల్లో ప్రశాంతమైన జిల్లాలను కూడా ముఠాకోరుల అడ్డాగా మార్చి ఫాక్షనిస్టుల హస్తగతం చేయడమే వైసిపి అభివృద్ది. స్థానికుల ఆస్తిపాస్తులన్నీ దోచి భూ కబ్జాదారులకు కట్టబెట్టడమే వైసిపి చేసేది. రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీలను మరిన్ని ఏర్పాటు చేయడంలో పోటీబడాలే తప్ప, ఉన్న సిఆర్ డిఏను రద్దు చేయడం అభివృద్ది అవుతుందా..?'' అని నిలదీశారు. 

''మీ సొంత నియోజకవర్గంలో ''పాడా(పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ అథారిటి)'' ఏర్పాటు చేసి, 13జిల్లాలకు ఉపయోగపడే సిఆర్ డిఏ(కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటి) రద్దు చేస్తారా..? అందుకే కదా మిమ్మల్ని అందరూ ''పులివెందుల పులకేశి''గా పేర్కొనేది. తన లాభం, పార్టీ లాభం తప్ప జనం లాభం జగన్ కు పట్టదు. సమాజం గురించి, రాష్ట్రం గురించి బాధ్యత లేదు. ''స్వంత బాధ్యతలే తప్ప సామాజిక బాధ్యత లేని సిఎం''గా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు'' అంటూ యనమల విరుచుకుపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios