Asianet News TeluguAsianet News Telugu

రాజధానిగా వైజాగ్... ఆ ప్రాంత వాసిగా నాకూ సంతోషమే: అయ్యన్నపాత్రుడు సంచలనం

శ్రావణ శుక్రవారం రోజున అమరావతి రైతు కుటుంబాలకు జగన్ మోసం చేయడం బాధాకరమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. 

TDP Seniour Leader Ayyannapatrudu Sensational comments on AP Capital
Author
Visakhapatnam, First Published Aug 2, 2020, 12:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విశాఖపట్నం: శ్రావణ శుక్రవారం రోజున అమరావతి రైతు కుటుంబాలకు జగన్ మోసం చేయడం బాధాకరమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కొరకు 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులను నయవంచనకు గురి చేయడం దారుణమని... శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులచేత కన్నీళ్లు పెట్టించిన ఆ పాపం ఊరికో పోదన్నారు. వాళ్లను బాధపెట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారని మండిపడ్డారు. 

''గతంలో రాజధాని ఎక్కడ కావాలనప్పుడు అన్ని పార్టీలు అమరావతే రాజధాని పెట్టాలని కోరాయన్న సంగతి జగన్ కు తెలియదా? ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఇక్కడే రాజధాని ఉండాలి, కనీసం 40వేల ఎకరాలు రాజధానికి కావాల్సిన అవసరం ఉంది, రాజధానికి పూర్తి మద్ధతు ఇస్తున్నామని చెప్పింది వాస్తవం కాదా? ఆనాడు మద్ధతునిచ్చి నేడు ఎందుకిలా చేశారు?'' అని ప్రశ్నించారు. 

''ఎన్నికల సమయంలో జగన్ ప్రతి మీటింగ్ లోను రాజధాని అమరావతి ఉంటుందని మాట ఇచ్చి నేడు తప్పుతారా? ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మడమ తిప్పుతారా? మూడు రాజధానుల మాట మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?  ఎన్నికల్లో రాజధాని పేరుతో ఓట్లు దండుకున్నారు. నేడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. గుంటూరు, కృష్ణ జిల్లా ఎమ్మెల్యేలందరూ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన మాట వాస్తవం కాదా?'' అని అడిగారు. 

''గవర్నర్ ఒకసారి రమేష్ కుమార్ విషయంలో తప్పు చేశారు. ఆ తరువాత సరిదిద్దుకొని న్యాయం చేశారు. మరి రాజధాని విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఒక్క సారి ఆలోచించాల్సింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దాదాపు 29వేల రైతు కుటుంబాలు నష్టపోయిన విషయం మీకు అర్ధం కావడం లేదా? గవర్నర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన వెనకాల ఎవరి ప్రోద్భలం ఉందో ప్రజలు ఆలోచించాలి'' అని పేర్కొన్నారు. 

''గత నెల 30వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అమరావతికే కట్టుబడి ఉన్నామని అన్నారు. వెంటనే 31వ తేదీన రాజధాని విషయంలో కేంద్రానికి ఏమీ సంబంధం లేదని అన్నారు. ఒక్క రోజులోనే మీ స్టేట్ మెంట్ మారిపోయింది. దీనిలో బీజేపీ హస్తం ఉందని ప్రజలకు అర్ధం అయ్యింది. అమరావతికి కట్టుబడి ఉన్నామని మళ్లీ ఆగస్టు 1వ స్టేట్ మెంట్ ఇచ్చారు. రాజధాని విషయంలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో అర్ధం కావాడం లేదు'' అని ఆరోపించారు.

read more   రాజధానిపై జగన్ సర్కార్ మరో ముందడుగు... సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ

''రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. రాజధాని శంకుస్థాపనకు మోడీ వచ్చినప్పుడు మట్టి, నీళ్లు తీసుకువచ్చారు. డిల్లీని మించిన రాజధాని చేస్తామని ప్రధానమంత్రి మాట ఇవ్వలేదా? బీజేపీ ఈ విషయాలను పునరాలోచించుకోవాలి. రాష్ట్రాన్ని విభజించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏమయ్యిందో మీకు తెలుసు'' అని హెచ్చరించారు. 

''రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ తరువాత ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ విషయంలోను మమ్మల్ని మోసం చేశారు. రైల్వే జోన్ ఏమయ్యింది? గవర్నర్ కేంద్రం నియమించినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేంద్రానికి తెలియకుండా తీసుకుంటారని ఎవరూ భావించడం లేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రెడ్డి చెంచాలు మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీ మీద ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీద శంకుస్థాపన చేశారు కాబట్టి దానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది'' అని అన్నారు. 

''రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు మీరు చేసిన త్యాగాలు ఊరకనే పోవు. రాజకీయంగా అమరావతి మీద వాళ్లు గెలవవచ్చు. కాని రేపు న్యాయం తప్పకుండా గెలుస్తుంది. బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ వంటి సీనియర్ నాయకులు వైజాగ్ కు రాజధాని వచ్చిందని వారి నాయకుడిని సంతోషపెట్టడానికి మాట్లాడుతున్నారు'' అని పేర్కొన్నారు. 

''రాజధాని అంటే 13 జిల్లాలకు అనుకూలమైన ప్రాంతంలో ఉండాలి. ఆ రోజు అవ్వన్ని ఆలోచించి, అందరి సలహాలు తీసుకొని, పవిత్రమైన కృష్ణా నది పక్కన ఉంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా పెట్టాం. రాజధాని వైజాగ్ లో ఉంటే ఆ ప్రాంత వాసిగా నాకూ సంతోషమే. కాకపోతే కడప, చిత్తూరు జిల్లాల నుంచి రాజధానికి రావాలంటే ఎంత సమయం పడుతుంది'' అని ప్రశ్నించారు. 

''ఆ రోజు చంద్రబాబు నాయుడు వైజాగ్ ను ఆర్ధిక రాజధానిగా పెడతామని చెప్పారు. హైకోర్టు కర్నూలు లో పెడతామంటున్నారు. ఏ పేదవాడు, రైతు, సామాన్యుడు హైకోర్టులో కేసు వెయ్యాలంటే కర్నూలు వరకు వెళ్లాలి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రభుత్వం ఆలోచించాలి. హైకోర్టు శ్రీకాకుళం పెట్టాలని నాకూ ఆశ ఉంది. కాని ఆశకు ఒక హద్దు ఉండాలి. ఏమన్నా అంటే ప్రాంతీయతత్వం లేపుతారా?'' అని మండిపడ్డారు.. 

''ఇప్పటికే ప్రధానమంత్రి వలన రైతులకు నష్టం జరిగింది. మళ్లీ రెండో సారి నష్టం జరగకుండా చూసుకోవాలి. గవర్నర్ చేసిన పొరపాటును సరిదిద్దుకొని పేద రైతులకు సాయం అందించాలని కోరుకుంటున్నాను'' అని అయ్యన్న అన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios