గాంధీజి, అంబేద్కర్ అంటేనే జగన్ కు కంపరం..కేవలం రాజారెడ్డే ఆదర్శం: యనమల సీరియస్
ఏపీ సీఎం జగన్ కు అహింస, సామాజిక న్యాయమంటే మింగుడు పడవని... తన రాజ్యమే తప్ప గ్రామ స్వరాజ్యాన్నిఆయన అంగీకరించడని మాజీ మంత్రి యనమల మండిపడ్డారు.
గుంటూరు: గాంధీజి అన్నా, అంబేద్కర్ అన్నా జగన్ రెడ్డికి కంపరమని... వాళ్లిద్దరి సిద్దాంతాలంటేనే జగన్ రెడ్డి కన్నెర్ర చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అహింస, సామాజిక న్యాయం జగన్ రెడ్డికి మింగుడు పడవని... తన రాజ్యమే తప్ప గ్రామ స్వరాజ్యాన్నిఆయన అంగీకరించడన్నారు. తన తాత రాజారెడ్డే జగన్ కు మార్గదర్శకుడన్నారు యనమల.
''భారత రాజ్యాంగం అంటేనే ఆయనకు కంటగింపు. ఆర్టికల్ 40, ఆర్టికల్ 38 అంటే ఆయనకు మంట. ఆర్టికల్ 40చెప్పిన ఆదేశ సూత్రాలను ఖాతరు చేయడు. ఆర్టికల్ 38చెప్పిన పంచాయితీల స్వయం పాలనను ధిక్కరిస్తాడు. ఆర్టికల్ 38పేర్కొన్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సాధికారత జగన్ రెడ్డి వ్యతిరేకం. రాజకీయ సాధికారత లేకపోతే ఆర్ధిక సాధికారత రాదు. ఇవి రెండూ లేకపోతే సాంఘిక సాధికారత సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగ పెద్దలు ఇంత కట్టుదిట్టంగా భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశారు, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు'' అన్నారు.
''జగన్ రెడ్డి సిఎం అయిన నాటినుండి యధేచ్చగా అన్నీ ఉల్లంఘనలే... రాజ్యాంగాన్ని గౌరవించడు, న్యాయ వ్యవస్థను లెక్కచేయడు, చట్టసభల ఔన్నత్యాన్ని అంగీకరించడు, అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశాడు, మీడియాపై తన ఆధిపత్యమే ఉండాలంటాడు. 4మూల స్థంభాలను కూల్చడమే జగన్ రెడ్డి లక్ష్యం. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టుపట్టించి వాలంటీర్ల రాజ్యంగా మార్చారు. తన అనుచరుల పెత్తనాన్ని బడుగు బలహీన వర్గాలపై రుద్దుతున్నారు. గ్రామీణ ప్రజల సాధికారత ఇష్టం లేదు. అందుకే పంచాయితీ ఎన్నికలకు మోకాలడ్డుతున్నారు'' అని ఆరోపించారు.
read more ''ఎన్నికల కమిషనర్ కుల గజ్జి వెధవ''.. ఇంకా ఏమన్నారంటే: బుగ్గనకు టిడిపి ఎమ్మెల్సీ లేఖ
''బిసి, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల సాధికారతను, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్నారు. సమాన అధికారాలకు వ్యతిరేకం జగన్ రెడ్డి. బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటిల హక్కుల అణిచివేతే అజెండాగా పెట్టుకున్నాడు. స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు 10%కోత పెట్టారు, 34%నుంచి 24%కు తగ్గించారు. ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడం, రైతులకు బేడీలు తగిలించడం, ఫీజులడిగిన విద్యార్ధులపై అత్యాచార సెక్షన్లు నమోదు, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తిపై 409కేసు, ప్రతిపక్ష నాయకులపై 307కేసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)కు బదులుగా జగన్ పీనల్ కోడ్ అమలుకు నిదర్శనాలు'' అన్నారు.
''వేలాది రైతుల ఆత్మహత్యలు, వందలాది ఆలయాల ధ్వంసం, వందలాది మహిళలపై అఘాయిత్యాలు, వేలాదిమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసుల నమోదు...దేశం మొత్తం చూస్తోంది. న్యాయమూర్తులపై కులం పేరుతో దుర్భాషలు, ఎన్నికల కమిషనర్ పై కులం పేరుతో దుర్భాషలు ముఖ్యమంత్రి స్థాయిలో జరగడం ఎక్కడైనా ఉందా..? ఎన్నికల కమిషనర్ విధి నిర్వహణకు అధికార యంత్రాంగం సహకరించని పరిస్ధితి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా..? ఎవరి బెదిరింపులకు భయపడి అధికార యంత్రాంగం ఇలా ధిక్కార ధోరణితో వ్యవహరిస్తోందో ప్రజలందరికీ తెలిసిందే. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తక్షణమే మేల్కొనాలి. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి'' అని కోరారు.
''రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు, వాటి నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిన బాధ్యత గవర్నర్ దే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) చెబుతోంది ఇదే. కాబట్టి జగన్ రెడ్డి ఫాసిస్ట్ ధోరణితో ఏపిలో ఏర్పడ్డ కానిస్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ను చక్కదిద్దాల్సింది గవర్నరే.. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ద పాలన జరిగేలా చూడాలి, రూల్ ఆఫ్ లా అమలయ్యేలా శ్రద్దపెట్టాలి. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలే జగన్ రెడ్డి ఫాసిస్ట్ వైఖరికి, ఫాక్షన్ నైజానికి, తుగ్లక్ చర్యలకు గుణపాఠం చెప్పాలి. లేకపోతే ఈ దుందుడుకు ధోరణులు మరింత పెడదారి పట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధ:పాతాళానికి చేరిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మరింత దిగజారే దుస్థితి దాపురిస్తుంది'' అని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.