రాజధాని రైతులకు, మహిళలకు, రైతుకూలీలకు వైసిపి వేసిన ఉరితాళ్లను తొలగించాల్సింది కేంద్రమేనన్నారు టీడీపీ నేత, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఆందోళనల్లో బీజేపీ స్వయంగా పాల్గొన్నప్పటికీ, రాజధాని సమస్యలను  పరిష్కరించడంలో కేంద్రం ఎందుకు తప్పించుకుంటుందో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి స్పష్టమైన అధికారాలు ఉన్నాయని యనమల చెప్పారు. దీనిపై గతంలో దేశంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Also Read:అమరావతి ఎంతో విలువైంది: బాబుపై విజయసాయి సెటైర్లు

‘‘ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మూడు రకాల మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది. ఎ) బైటనుంచి దురాక్రమణ, బి) అంతర్గత సంఘర్షణలు సి) రాజ్యాంగానికి అనుగుణంగా ఏ రాష్ట్రం లోనైనా పరిపాలన సాగక పోయినప్పుడు ’’. 3వ  నిర్దేశంలో చెప్పినట్లుగా, ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగానికి అనుగుణంగా పాలన జరిగేలా చూడాల్సింది ఎవరని రామకృష్ణుడు ప్రశ్నించారు.

నా దృష్టిలో ఇది రాష్ట్రపతి, లేదా కేంద్ర ప్రభుత్వం,  లేదా న్యాయవ్యవస్థ పరిష్కరించాల్సిన అంశమని.. అంతిమంగా ప్రజలే నిర్ణయించే అంశమని తన అభిప్రాయమని యనమల అన్నారు. మరోవైపు జగన్ చెప్పినట్లు నా నిర్ణయాలపై నేను న్యాయనిర్ణేతగా ఉండలేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో అమరావతి నుండి రాజధానిని, హైకోర్టును మరోచోటకు మార్చేందుకు ప్రయత్నిస్తే, ఆర్టికల్ 355-సి అమలుకు మన సమాఖ్య రాజ్యం అనుమతిస్తుందని రామకృష్ణుడు సూచించారు.

రాజధాని రైతులకు పూర్తిగా సహకరిస్తామని బిజెపి వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో, రైతులకు అనుకూలంగా ఈ సమస్య పరిష్కారానికి కేంద్రానికి అవశేషాధికారాలు ఉన్నాయన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో అప్పటి అసెంబ్లీలో రాజధానిపై ఏకగ్రీవ తీర్మానం జరిగింది మరియు అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని యనమల గుర్తుచేశారు.

దీనిని అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు మరియు ధృవీకరించారన్నారు. నాడు శాసనసభలో అన్ని పార్టీలు  సైతం అంగీకరించాయని యనమల తెలిపారు.

Also Read:నష్టమే కదా: అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ఆమోదించిందన్నారు. ఇప్పుడు  జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు దురుద్దేశంతో చేస్తున్న రివర్స్ నిర్ణయాన్ని సీఎం, ఆయన పార్టీ తప్ప అందరూ వ్యతిరేకిస్తున్నారని యనమల చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కానీ, ప్రజామోదం కానీ లేదని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై 233 రోజులుగా తీవ్ర ఆందోళన జరుగుతోందని.. ప్రజల్లో వ్యతిరేకత చూసైనా, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు.