‘బిజెపి గొడుకు కిందకు చేరాలని వైసిపి ఆరాటం’...

‘కేసుల మాఫీ కోసమే వైసిపి నేతలు తిరుగుతున్నారు’..

ఇవి తాజాగా టిడిపి సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు. మొత్తం మీద చూస్తుంటే టిడిపి గోలేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది కోసమే పాకులాడుతుంది. అదే పని వైసిపి కూడా చేస్తోంది. అందులో ఆశ్చర్యపోవటానికి కానీ లేదా తప్పు పట్టటానికి కానీ ఏముంది?

అంతెందుకు 2014లో చంద్రబాబునాయుడు బిజెపితో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు? దేశవ్యాప్తంగా నరేంద్రమోడి హవా నడుస్తోందని పసిగట్టిన చంద్రబాబు నానా అవస్తలు పడి బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు ఓసారి పొత్తు పెట్టుకుని అర్ధాంతరంగా వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. జన్మలో బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని చంద్రబాబే బహిరంగంగా చెప్పిన సంగతి అందరికీ గుర్తే. అటువంటిది మళ్ళీ 2014లో మళ్ళీ ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడినట్లు?

ఇక, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసుల మాఫీ కోసం వైసిపి ప్రయత్నిస్తోందంటున్నారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటమేంటో యనమలే చెప్పాలి? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అవకాశం అధికారంలో ఉన్న పార్టీకి అవకాశముంటుంది. రాష్ట్రాభివృద్ధికి వైసిపికి చిత్తశుద్దితో పనిచేయటం లేదట. ప్రతిపక్షంలో ఉన్న వైసిపి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో యనమలే చెప్పాలి?