అమరావతి: స్థానిక సంస్థలను మానిటర్ చేయడానికి ప్రభుత్వం వేసిన కమిటీలో అందరూ రెడ్లే ఉన్నారని, రెడ్లు తప్ప ఇంకెవరూ లేరా అని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రెడ్డి కులాన్నే వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. మరో టీడీపీ నేత అచ్చెన్నాయుడితో కలిసి ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీకి జగన్ కులాన్ని అంటగట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. 

రెడ్లను ప్రోత్సహిస్తూ వైఎస్ జగన్ బలహీనవర్గాలను అణచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రౌడీయిజం, పోలీసు వ్యవస్థ ఒక్కటై ఎన్నికలను భ్రష్టు పట్టించాయని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ ను ప్రశ్నించే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా, రాజకీయ నేత అనర్హుడని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అనుగుణంగానే సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారని ఆయన అన్నారు.

Also Read: తగ్గేది లేదు: నీలం సాహ్ని లేఖకు ఈసీ రమేష్ ఘాటు రిప్లై

కొందరు ఐఎఎస్ లు ప్రభుత్వానికి సహకరిస్తూ ఎన్నికలను భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు, 14వ ఆర్థి సంఘానికి సంబంధం లేదని ఆయన స్ఫష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు పెడితే నష్టపోతామని జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. రీఎలక్షన్ పెడితే డిపాజిట్లు రావని జగన్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. 

ఎన్నికలను వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాపై ఆంక్షలను ఆయన తప్పు పట్టారు. మీడియాను కట్టడి చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే రాజ్యాంగం అంగీకరించదని ఆయన నఅనారు. జగన్మోహన్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని యనమల వ్యాఖ్యానించారు.  

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందని, అన్ని చోట్లకు అది వ్యాపిస్తోందని, ఈ స్థితిలో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారని, ఇటువంటి స్థితిలో ఈసీ తన పరిధిలో తనకున్న అధికారాల మేరకు ఎన్నికలను వాయిదా వేసిందని అని ఆయన అన్నారు.

Also Read: అదే సామాజిక వర్గం, రమేష్ కుమార్ వెనక చంద్రబాబు: జగన్

ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి సంస్థ అని, రాజ్యాంగబద్దమైన సంస్థను అవమానించే విధంగా జగన్ మాట్లాడారని ఆయన అన్నారు. జగన్ తీరు చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని పాలించడానికి గానీ రాజకీయల్లో నేతగా ఎదడగానికి గానీ అవకాశం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నర్ మీద, రాష్ట్రపతిపైనా ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రిపై రాష్ట్రపతి, గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా పై మాట్లాడిన మాటలతో రాష్ట్రం పరువు పోయిందని అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈసీ పైనా విమర్శలు చేస్తుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కుల ప్రాధాన్యంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు, వైకాపా సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు.

వైకాపా లో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో బహిర్గతం చేస్తానని చెప్పారు. చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నాఅని ఆయన అన్నారు. ఎన్నికలకు ఆర్ధిక సంఘం నిధులకు సంబంధం లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. జగన్ ఇప్పటికైనా సమాజం గురించి తెలుసుకుని వ్యవహారశైలి మార్చుకోవాలని ఆయన హితబోధ చేశారు. 

ప్రపంచం మొత్తం కరోనా అప్రమత్తత గురించి మాట్లాడుతుంటే జగన్ ఒక్కరే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కరోనాను పారద్రోలి ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమవుదామని అన్నారు. రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన 6వేల మందిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు.