అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాసిన లేఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా సమాధానమిచ్చారు. మూడు పేజీల లేఖను ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేశారు. నీలం సాహ్ని రాసిన లేఖ బయటకు రావడంపై కూడా ఆయన తీవ్రంగా పరిగణించిట్లు కనిపిస్తోంది. 

తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఎన్నికల వాయిదాపై తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన చెప్పారు.  తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తాను రాగద్వేషాలకు గానీ పక్షపాతానికి గానీ లోబడి చేయలేదనే విషయాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. 

also Read: జగన్ ప్రభుత్వం ఫైట్: ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ నీలం సహానీ లేఖ

తాను కేంద్ర ప్రభుత్వాన్ని, టాస్క్ ఫోర్స్ తో సంప్రందించిన తర్వాతనే ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను ఈ నెల 14వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారితో మాట్లాడానని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చానని ఆయన అన్నారు.  

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను ఆయన తన లేఖలో వివరించారు. నిబంధనలకు, అధికారాలకు లోబడే తాను నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గోవాలో ఎన్నికలను వాయిదా వేయాలా, వద్దా అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ స్థితిలో ఎన్నికలను వాయిదా వేయడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన వివరించారు.

also Read: అదే సామాజిక వర్గం, రమేష్ కుమార్ వెనక చంద్రబాబు: జగన్

ఎన్నికలను వాయిదా వేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతాయనే ప్రభుత్వ వాదనను ఆయన తోసిపుచ్చారు. తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిధులను తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలా తెప్పించుకున్న సందర్భాలు తనకు తెలుసునని ఆయన చెప్పారు. ఆ నిధులను ఎలా తెప్పించుకోవచ్చనే విషయం తనకు తెలుసునని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. దేశం కరోనా సవాల్ ఎదుర్కునే విషయంలో ఏపీ ఒంటరిగా లేదని ఆయన చెప్పారు.