సొంత పార్టీకి చెందిన వ్యక్తిపైనే వైసిపి ఎమ్మెల్యే కన్నబాబు చేయిచేసుకున్న ఘటన యలమంచిలిలో చోటుచేసుకుంది.
అనకాపల్లి : గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమ సమస్యల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు మహిళలు, యువకులు నిలదీసిన ఘటనలు ఇప్పటికే వెలుగుచూసాయి. తాజాగా మరో వైసిపి ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవమే ఎదురవగా సహనం కోల్పోయిన ఆయన ప్రశ్నించిన వ్యక్తి చేయిచేసుకున్నారు.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) నిన్న ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పూడిమడకకు వెళ్లగా సొంత వైసిపి శ్రేణుల నుండి నిరసన ఎదురయ్యింది. ప్రజల సమస్యల కంటే ముందు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కన్నబాబును స్థానిక వైసిపి నాయకులు నిలదీసారు. సొంత పార్టీ నాయకులే ఇలా తమను అందరిముందు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయారు.
వీడియో
అప్పటికే సహనం కోల్పోయి ఆగ్రహంగా వున్న ఎమ్మెల్యే కన్నబాబును ఓ వ్యక్తి గత ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసాడు. దీంతో నన్నే నిలదీస్తావా అంటూ కన్నబాబు అతడిపై చేయిచేసుకున్నాడు. ప్రశ్నించిన వ్యక్తి చెంప చెళ్లుమనిపించడంతో స్థానిక వైసిపి నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పూడిమడకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read More చేతికి మట్టి అంటకుండా నేరాలు .. జగన్ ఒక టెక్నికల్ క్రిమినల్ : టీడీపీ నేత కూన రవికుమార్
ఎమ్మెల్యే కన్నబాబు అనుచరులు, స్థానిక వైసిపి నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్యల గురించి ప్రశ్నించిన సొంత పార్టీ నాయకులను ఎమ్మెల్యే అందరిముందే కొట్టడం ఏమిటని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ కన్నబాబును అడ్డుకున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార వైసిపి ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో వుండేలా సీఎం జగన్ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇలాంటివే గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాలు. ఇందులో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
Read More లోటస్‌పాండ్‌కు మీ పేర్లు పెట్టుకోండి..: జగన్ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్
గడపగడపకు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ప్రజలు తిరగబడ్డారు. తమకు ఇళ్లు లేవని కొందరు, వీధుల్లో కరెంట్ స్తంభాలు లేవంటూ మరికొందరు ఎమ్మెల్యేను నిలదీసారు. తమకు ఏం చేసారో చెప్పాలంటూ యువకులు, మహిళలు ఎమ్మెల్యేను నిలదీసారు. తమ ఇళ్లవద్దకు రావద్దని కొందరు ఎమ్మెల్యే మొహంమీదే చెప్పేసారు. దీంతో ఎమ్మెల్యే కూడా సహనం కోల్పోయి ఆవేశంతో ఊగిపోతూ గ్రామస్తులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తులను సర్దిచెప్పి పంపించేసారు.
