త్వరలోనే వై.ఎస్. షర్మిల కాంగ్రెస్‌లో చేరిక: గిడుగు రుద్రరాజు
వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మల్లికార్జున ఖర్గే తనకు చెప్పారని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు ప్రకటించారు.
అమలాపురం:వై.ఎస్. షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సోమవారంనాడు అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని తనకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలిపారన్నారు.వైఎస్ఆర్‌సీపీకి చెందిన పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు తమతో టచ్ లో ఉన్నారని గిడుగు రుద్రరాజు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తామని రుద్రరాజు వివరించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడ వస్తారని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు, వై.ఎస్. జగన్ పాలనతో ప్రజలు విసిగి పోయారన్నారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని రుద్రరాజు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 నుండి 15 శాతం ఓట్లను తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. గత ఏడాది డిసెంబర్ 27న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు సమావేశమయ్యారు.
2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీలలో చేరారు. ఈ రెండు పార్టీలలో చేరని నేతలు రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేరు . అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.
ఈ క్రమంలోనే వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోనుంది. వై.ఎస్. షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి ఉంది. అయితే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు వై.ఎస్. షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే రాజకీయంగా నష్టమని పార్టీ నాయకత్వం ముందు తమ వాదనలు పెట్టారు. దీంతో వై.ఎస్. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం వాయిదా పడింది. ప్రస్తుతం వైఎస్ఆర్‌టీపీ విలీనం ప్రక్రియపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరనుంది.
also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని షర్మిలకు కట్టబెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.