పవన్ జనాకర్షణకు లక్ష్యీనారాయణ లాంటి గుడ్ విల్ ఉన్న అధికారులు తోడైతే బాగానే ఉంటుంది.

ఒకపుడు రాష్ట్రంలో బాగా పాపులరైన ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతారా? అవుననే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో లక్ష్మీనారాయణకు బాగా ప్రచారం వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ వ్యతిరేక మీడియా సదరు అధికారికి బాగా ప్రచారం కల్పించిందనే ఆరోపణలున్నాయనుకోండి అది వేరే సంగతి. ఏదేమైనా లక్ష్మీనారాయణకు వచ్చినంత ప్రచారం గతంలో ఏ పోలీసు అధికారికీ దక్కలేదన్నది మాత్రం వాస్తవం.

అయితే, డిప్యుటేషన్ పూర్తియిపోగానే అధికారి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. దాంతో అడప దడపా తప్ప ఆయన గురించి పెద్దగా ప్రచారం జరగటం లేదు. అయితే, ఇపుడు మళ్లీ లక్ష్మీనారాయణ గురించి కొన్ని పొలిటికల్ సర్కిళ్ళలో ప్రచారం మొదలైంది. ఈ ఏడాది చివరకి గానీ లేదా వచ్చే ఏడాదిలో గానీ ఆ అధికారి జనసేన పార్టీలో చేరుతున్నారని. ఎలాగూ పాపులరే కాబట్టి కొత్తగా లక్ష్మీనారాయణకు ప్రచారం అవసరం లేదనుకోండి. ఐపిఎస్ అధికారి జనసేనలో గనుక చేరితే నిజంగా సంచలనమే.

ఈపవ విషయమై పవన్ కల్యాణ్-ఐపిఎస్ అధికారి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ జనసేనలో చేరిన తర్వాత ఆయనతో పాటు మరింతమంది విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు కూడా జనసేన తీర్ధం పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ పరిస్ధితిపై పవన్ ఇటీవలే ఒక సంస్ధ ద్వారా సర్వే చేయించుకున్నట్లు కూడా తెలిసింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం పవన్ ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎందుకంటే, ఇప్పటికీ చంద్రబాబే పవన్ ను వెనకుండి నడిపిస్తున్నారని నమ్మేవాళ్ళున్నారు.

రెండున్నరేళ్ళ పాలనలో మిత్రపక్షాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయన్నది సర్వేలో తేలిందట. అదేవిధంగా వైసీపీ పైన కూడా జనల్లో పూర్తిస్ధాయి నమ్మకం కుదరటం లేదట. దాంతో రాష్ట్రంలో జనాలకు ప్రత్యామ్నాయంగా మరే పార్టీ లేదు కాబట్టి ఇప్పటి నుండే పవన్ క్రియాశీలమైతే బాగుంటుందని పలువురు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకేనేమో పవన్ కూడా స్పీడ్ అవుతున్నారు. ఎలాగూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వదు. కాబట్టి అదే అంశాన్ని పట్టుకుంటే జనల్లోకి ఎన్నిసార్లైనా వెళ్ళవచ్చన్నది పవన్ వ్యూహంగా తెలుస్తోంది. పవన్ జనాకర్షణకు లక్ష్యీనారాయణ లాంటి గుడ్ విల్ ఉన్న అధికారులు తోడైతే బాగానే ఉంటుంది. కానీ రాజకీయ నేతగా పవన్ గురించి జనాభిప్రాయం ఎన్నికల్లో గానీ బయటపడదు కదా?