ఏళ్లుగా కడప చేరుకునేందుకు చంద్రబాబు నాయుడు యాత్ర సాగిస్తూనే ఉన్నాడు. ఈ సారైనా చేరుకోగలడా?

వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలొస్తాయని చెబుతూ దూకుడు పెంచిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ ఆర్ సి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సైకలాజికల్ గా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కడప జిల్లాలో, తర్వాత రాయలసీమలో పచ్చ జండా పాతేందుకు చూస్తున్నారు. ఈ రెండింటిలో కూడా కడప వారికి ముఖ్యం. కడపలో జండా ఎగరేసి,‘సొంత జిల్లా ప్రజలే నిన్ను తిరస్కరించారు, ఇక ఇతర జిల్లాలో నిన్నెవరు తిరగనిస్తారు,’ అని ప్రచారం చేసేందుకు వ్యూహం పన్నినట్లు కనబడుతుంది.

ఈ విషయంలో కడప జిల్లాలో చాలా ముందుకెళ్లారు. ఒక రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఉన్నారు. శాసన మండలి డిప్యూటి ఛెయిర్మన్ సతీష్ రెడ్డి, విప్ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఒక కార్పొరేషన్ ఛెయిర్మన్ లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరద రాజులు రెడ్డి, మరొక ఎమ్మెల్సీ బి పుల్లయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి... ఇలా పెద్ద తలకాయలన్నీ టిడిపిలో నే ఉన్నాయి

దీనికి తోడు, ఈ జిల్లాను లోకేశ్ సొంతంగా పర్యవేక్షిస్తున్నారట. వీటికి తోడు ఇన్ చార్జ్ మంత్రి గంటా శ్రీనివాస రావు. వీరందరి సహాయంతో వచ్చే మార్చిలో జరుగనున్న టీచర్స్, గ్రాజుయేట్స్, స్థానిక సంస్థ ల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు మూడింటిని గెల్చుకునేందుకు టిడిపి వ్యూహం అమలు చేస్తూ ఉంది. మరొక విషయం ఏమిటంటే స్థానిక సంస్థల తరుఫున జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తున్నాడు.

అందువల్ల వివేకాను ఓడించడమంటే జగన్ ను ఓడించడమే. వివేకాను ఓడించి జగన్ ను ఓడించినంత హంగామా సృష్టించేందుకు చంద్రబాబు , చిన్న బాబు చూస్తున్నారు. ఇందులో భాగంగా సిబి ఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొ రేట్ లతో విచారణ వేగవంతం చేయింది, జగన్ కేసులు మళ్లి చర్చనీయాంశం చేసేందుకు మరొక వైపు నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి.


పెద్ద తలకాయలు ఎన్ని కనబడ్డా, జిల్లాకు తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదనే భావన ఇక్కడి ప్రజల్లో పడిపోయింది. రాజశేఖర్ రెడ్డి కాలంలో కడప ప్రాముఖ్యం విపరీతంగా పెరిగి, దాని ప్రభావం జిల్లా అంతటా కనిపించింది. తర్వాత జిల్లాను చంద్రబాబు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాడనే భావం ప్రజల్లో బాగా నాటుకు పోయింది. దీనికి సాక్ష్యంగా అంతా కడపస్టీల్ ప్లాంట్ నిర్మాణం పునరుద్ధరించకపోవడం. దానికి తోడు అనంతరం ఐరన్ వోర్ ను ఎక్కడికో విశాఖకు తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు.

 ఇంతమంది టిడిపి నాయకులున్నా జిల్లా కు తెచ్చేందేమీ లేదనే అసంతృప్తి వుంది. దీనిని ఈ నాయకులు, మంత్రులు పొగొట్ట గలరా...ఈ నాయకుల పలుకుబడి ప్రజల్లో ఎంత ఉందో తెలుసుకోవాలంటే మార్చిదాకా అగాల్సిందే...