పెళ్ళి కాకుండానే ఏళ్లుగా సహజీవనం చేస్తూ తల్లిని కూడా చేసిన ప్రియుడు మరో పెళ్లికి సిద్దపడటంతో బాధిత మహిళ న్యాయపోరాటానికి దిగింది.

నరసరావుపేట : ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు... మాయమాటలతో నమ్మించి పెళ్ళి చేసుకోకుండానే సహజీవనం చేసాడు... ఇప్పుడు మోజు తీరిపోయాక ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇలా ప్రాణంగా ప్రేమించిన వాడికి సర్వస్వాన్ని అర్పించి మోసపోయిన మహిళ న్యాయ పోరాటానికి దిగింది. తనకు న్యాయం కావాలంటూ ప్రియుడి ఇంటిముందే మహిళ ఆందోళనకు దిగిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. 

ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంకు చెందిన బత్తుల రాజు నెలటూరి ఝాన్సీరాణి ప్రేమించుకున్నారు. వీరి మనసులు కలవడంతో శారీరకంగా దగ్గరయ్యారు. ఇలా కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకేచోట వుంటూ సహజీవనం చేసారు. దీంతో వీరికి సంతానం కూడా కలిగింది. 

వీడియో

పెళ్లి చేసుకోకుండానే ఝాన్సీరాణిని తల్లిని చేసిన ప్రియుడు ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడట. మరో మహిళతో వివాహానికి సిద్దమవడంతో న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటూ గత అర్ధరాత్రి నుండి ఆందోళనకు చేపట్టింది. 

ఇరుకుపాలెం లోని ఎస్సీ కాలనీలో ప్రియుడు రాజు ఇంటిముందు కూర్చుని మౌన దీక్ష చేపట్టింది ఝాన్సీ. తనకు న్యాయం జరిగేవరకు ఈ దీక్ష కొనసాగిస్తానని తెలిపింది. ప్రియుడు రాజు మరో పెళ్ళి ప్రయత్నాలు విరమించుకోవాలని... తనకు అన్యాయం చేయవద్దని కోరుతోంది.