Asianet News TeluguAsianet News Telugu

సంచలనం...విజయవాడలో మహిళా డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

ఏపీ సీఆర్డీఏలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ మాధురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

women deputy collecto arrest in vijayawada
Author
Vijayawada, First Published Jun 3, 2020, 10:40 PM IST

అమరావతి: ఏపీ సీఆర్డీఏలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ మాధురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న సిట్ బృందం రిమాండ్ కి తరలించింది. 

అరెస్ట్ కు సబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని నెక్కల్లు గ్రామంలో 2016 లో ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు డిప్యూటీ కలెక్టర్ అభియోగాలున్నాయి. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ చేసి అక్రమంగా భూమి బదలాయింపు జరిగినట్లు నిర్దారించింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి పంపిన సిట్ అధికారులు తాజాగా డిప్యూటీ కలెక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

స్నానం చేసే మహిళల వీడియోలు తీసి వేధింపులు...: వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు మొదలు విచారణ, చార్జిషీట్ వరకు అధికారాలు కట్టబెడుతూ ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేసేందుకు ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీఆర్డీఎ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అమరావతి విషయంలోనే కాకుండా ఇతర ప్రాజెక్టులపై కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సాక్షులను విచారించడంతో పాటు చార్జిషీట్ కూడా సిట్ దాఖలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు పలువురు చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది. 

అమరావతిలో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. పలువురు బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని వారు భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios