Asianet News TeluguAsianet News Telugu

స్నానం చేసే మహిళల వీడియోలు తీసి వేధింపులు...: వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

వైసిపి ఏడాది పాలనలో దళితులపై వైసిపి అరాచకాలు పేట్రేగాయని... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ దళిత  ద్రోహి అని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

Chandrababu Naidu Meeting With SC Leader
Author
Amaravathi, First Published Jun 3, 2020, 8:59 PM IST

గుంటూరు: వైసిపి ఏడాది పాలనలో దళితులపై వైసిపి అరాచకాలు పేట్రేగాయని... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ దళిత  ద్రోహి అని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం తన నివాసం నుంచి ఆన్ లైన్ లో దళిత నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటి అయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘2018-19లో టిడిపి ప్రభుత్వం రూ11,228కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ కు ఖర్చు చేయగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది రూ 15వేల కోట్లు కేటాయించి అందులో రూ 6,332కోట్లు మాత్రమే ఖర్చు చేసి దళితులకు ద్రోహం చేసింది. ఆ నిధులను కూడా అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు మళ్లించారు. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద 3వేల ఎకరాలను టిడిపి ప్రభుత్వం కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనలో 4వేల ఎకరాల భూములను ఎస్సీలనుంచి బలవంతంగా లాక్కున్నారు''అని ఆరోపించారు. 

''టిడిపి ఇచ్చిన లిడ్ క్యాప్ భూములను వైసిపి నాయకులు లాక్కున్నారు. దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్నారు. దళిత గడ్డపై (6 ఎస్సీ నియోజకవర్గాల మధ్య) రాజధాని ఉండరాదని అమరావతిని తరలించే కుట్రలు పన్నారు. రూ100కోట్లతో టిడిపి ప్రభుత్వం చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనాన్ని అడ్రస్ లేకుండా చేశారు. 125అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నాంది పలికితే, దానిని నిర్వీర్యం చేశారు'' అన్నారు. 

''45ఏళ్లకే పించన్ ఇస్తానన్న హామీని తుంగలో తొక్కారు. కార్పోరేషన్ ల నిధుల్లో కోతలు పెట్టారు, దారి మళ్లించారు. గత ఏడాదిగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగాయి.
 విశాఖలో దళిత వైద్యుడు సుధాకర్ రావుపై దాడిచేసి ఆయనపైనే ఎదురు కేసులు పెట్టారు. 10ఏళ్లు ఎంపిగా ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ ను 48రోజులు జైల్లో పెట్టారు. భాగ్యలక్ష్మి జాబ్ కార్డు తొలగించారు. పల్నాట 150దళిత కుటుంబాలను ఊళ్లలో నుంచి తరిమేశారు''  అని అన్నారు. 

''గుంటూరు జిల్లా దాచేపల్లిలో, రామిరెడ్డి పేటలో, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లిలో, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా దళిత బిడ్డపై అత్యాచారానికి పాల్పడి ఆ కుటుంబానికి ఉన్న ఎస్సీ సర్టిఫికెట్ కూడా రద్దు చేయించడం వైసిపి దుర్మార్గాలకు పరాకాష్ట'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''మాస్క్ అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం, కక్షకట్టి ఆయనను వెంటాడటం, కుటుంబ సభ్యులను వేధించడం, నడిరోడ్డుపై మెడ రెక్కలు తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టడం, మెంటల్ ఆసుపత్రిలో చేర్చడం, తాగుబోతు ముద్ర వేయడం గవర్నమెంట్ టెర్రరిజం కాదా..? వైసిపి ఉన్మాదం కాదా..? మందులు అక్రమ రవాణా అడ్డుకుందన్న కక్షతో చిత్తూరు వైద్యురాలిపై దౌర్జన్యం చేశారు, వేధింపులకు పాల్పడ్డారు'' అని తెలిపారు. 

''భూములు లాక్కున్నారన్న మనోవేదనతో జంగారెడ్డిగూడెం రత్నరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూసపాటి రేగ మండలం కొవ్వాడలో దళితుల భూములను కబ్జా చేశారు. 
దళితులకు పరిహారం చెల్లింపులో కూడా వైసిపి వివక్ష చూపడం హేయం.  గ్యాస్ లీకేజి మృతుల కుటుంబాలకు ఒకరకంగా పరిహారం ఇచ్చి,  కరెంట్ షాక్ దుర్ఘటనలో మృతిచెందిన దళిత కుటుంబాలకు అందులో పదోవంతు పరిహారం కూడా ఇవ్వక పోవడం వైసిపి వివక్షకు నిదర్శనం'' అన్నారు. 

''ఏం తప్పు చేశాడని మాజీ ఎంపి హర్షకుమార్ ను 48రోజులు జైల్లో పెట్టారు..? ఏం తప్పు చేశాడని దళిత వైద్యుడు సుధాకర్ రావును నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారు..? ఏం తప్పు చేసిందని భాగ్యలక్ష్మి జాబ్ కార్డు తొలగించారు..? ఏం తప్పు చేశారని దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు..?రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా..? పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తున్నారా..? పులివెందుల పంచాయితీలతో భయభ్రాంతులకు గురిచేస్తారా..? రాష్ట్రాన్ని రౌడీరాజ్యంగా చేస్తారా..? పోలీసుల వత్తాసుతో పేదలపై దౌర్జన్యాలు చేస్తారా..? దళితుల భూములు లాక్కుంటారా, ఇళ్లు కూల్చేస్తారా..? అత్యాచారాలకు పాల్పడి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయిస్తారా..? స్నానం చేసే ఆడబిడ్డలపై వీడియోలు తీసి వేధింపులకు పాల్పడతారా, ఆత్మహత్యలకు పురిగొల్పుతారా..?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

''ఈ అరాచకాలకు వైసిపి  తగిన మూల్యం చెల్లించక తప్పదు. దళిత నాయకత్వం ఎదిగే అవకాశం ఇది. వైసిపి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలి. దళితులంతా కలిసికట్టుగా పనిచేయాలి. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాలి. సమాజంలో యువ నాయకత్వం ఎదిగి రావాలి. ముక్త కంఠంతో అన్యాయాలను ప్రతిఘటించాలి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పోరాడాలి'' అని పిలుపునిచ్చారు. 

''టిడిపి హయాంలో ఎస్సీ సంక్షేమానికి రూ40వేల కోట్ల బడ్జెట్ పెట్టాం. పించన్ వయోపరిమితిని 65ఏళ్ల నుంచి 50ఏళ్లకు తగ్గించాం. యువతకు 2వేల ఇన్నోవా కార్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాం. పున్నయ్య కమిషన్ వేసి దళిత హక్కులు కాపాడాం.  గ్రామాల్లో రెండు గ్లాసుల పద్దతిని సమూలంగా తొలగించాం. హౌసింగ్ లో దళితులకు పెద్దపీట వేశాం. 70% ఇళ్లు దళితులకే కేటాయించాం. రాజకీయాల్లో దళిత నాయకత్వాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాం. బాలయోగి, ప్రతిభా భారతి తదితరులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించాం'' అని గుర్తు చేశారు. 

'' కానీ తాను అనని మాటలను అన్నట్లుగా చిత్రించి దూరం చేయాలని కుట్రలు చేశారు. మాయమాటలతో టిడిపిని దూరం చేయలేరు.  బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశంగా'' అని చంద్రబాబు పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios