ప్రియుడి మోజులో పడి కాబోయే భర్తను హత్య చేయించిందో డిగ్రీ సెకండియర్‌ యువతి. తమ ప్రేమను ఇంట్లోవాళ్లు ఒప్పుకోకుండా వేరే పెళ్లి నిర్ణయించారని ప్రియుడితో కలిసి కర్కశంగా కడతేర్చింది. రోడ్డుప్రమాదమా, అనుమానాస్పద మృతి అని డౌట్ పడ్డ పోలీసులకు అసలు విషయం తెలిసి దిమ్మ తిరిగింది. 

ఆళ్లగడ్డకు చెందిన బీకాం కంప్యూటర్స్‌ సెకండియర్‌ చదువుతున్న ఓ యువతి అదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడింది. ఇది తెలిసి కుటుంబ సభ్యులు మందలించినా  వారిలో ఏమాత్రమూ మార్పు రాలేదు. దీంతో తమ కూతురికి రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్‌ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రమూ ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.

తన ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేశారు. మరో ముగ్గురి సాయం తీసుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పది రోజులుగా రోజూ ఫోన్‌లో ప్రేమగా మాట్లాడేది. ఈ క్రమంలోనే శనివారం బాచ్చాపురంలో గడేకారి పనికి పోయిన గఫార్‌బేగ్‌కు ఫోన్‌ చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేరు. నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంటికి రా’ అంటూ నమ్మ బలికింది. గఫార్ బేగ్ యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ రెండు గంటలు గడిపాడు. ఆ తరువాత చీకటి పడడంతో మోటార్‌ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. 

అయితే అప్పటికే కోటకందుకూరు సమీపంలో సిద్ధంగా ఉండాలంటూ ప్రియుడుతో పాటు మరో యువకుడిని బైక్‌పై పంపించింది. అతను ఏ దారిలో వెళ్తాడోనన్న అనుమానంతో మరో ఇద్దరిని ఇంకో బైకుపై గఫార్ బేగ్ వెనక పంపింది. గఫార్‌బేగ్‌ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపు గాచిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు.  తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 

కాగా..కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. ముందు రోడ్డు ప్రమాదమని భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా  పరిశీలించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

డీఎస్పీ రాజేంద్ర ఆదేశాల మేరకు మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా కూపీ లాగారు. అసలు విషయం బయటకు రావడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సీఐ సుదర్శన ప్రసాద్‌ మాట్లాడుతూ అనుమానితులను విచారిస్తున్నామని,  పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. ఈ కేసు మిస్టరీని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించడం గమనార్హం.