ఓ యువతి 21 యేళ్ల తరువాత తన కుటుంబాన్ని చేరుకుంది. హైదరాబాద్ లో 21యేళ్ల క్రితం అదృశ్యమైన ఆమె గుజరాత్ లోని సేవాశ్రమంలో ఆశ్రయం పొందింది. పోలీసుల చొరవతో ఎట్టకేలకూ తండ్రి, అక్క దగ్గరికి చేరింది.
కర్నూలు : 21యేళ్ల క్రితం అదృశ్యమైన కూతురిని తండ్రి చెంతకు చేర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్బి సిఐ పవన్ కిషోర్ తో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన కట్ట నాగిశెట్టి, సత్యవతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు సంతానం. అయిదో కుమార్తె శ్రీదేవికి మతిస్థిమితం సరిగా లేదు. కుటుంబం అంతా 2001 మార్చిలో హైదరాబాద్ కు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ లో శ్రీదేవి అదృశ్యమయింది.
అప్పటికి ఆమె వయసు14 ఏళ్లు. కూతురు కనిపించకపోవడంతో ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చి స్వగ్రామానికి చేరుకున్నారు. తర్వాత నాగిశెట్టి భార్య సత్యవతితో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు చనిపోయారు. ఇంకో కుమార్తె శ్యామల, అల్లుడు నాగరాజు కర్నూలు మండలం దేవమడలో ఉండగా నాగిశెట్టి వారి వద్దే ఉంటున్నాడు. అదృశ్యమైన శ్రీదేవి రైలు ఎక్కి గుజరాత్ రాష్ట్రానికి చేరుకుంది. అహ్మదాబాదులో అనాధగా తిరుగుతున్న శ్రీదేవిని మదర్ తెరిసా ట్రస్ట్ వారు చేరదీశారు. వారు ఆమెను గుజరాత్లోని వడోదరలో ఉన్న పారుల్ సేవాశ్రమం వైద్యశాలలో చేర్పించారు.
వారం క్రితం కోలుకున్న శ్రీదేవి తన వివరాలు చెప్పింది. వెంటనే ఆస్పత్రి వైద్యులు అలంపూర్లో వాకబు చేయగా నాగిశెట్టి దేవమడలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని సంప్రదించగా.. నాగిశెట్టి చిరునామా గుర్తించారు. తండ్రి, అక్క శ్యామల ఫోటోలు పంపి చూపించడంతో శ్రీదేవి గుర్తుపట్టింది. కర్నూల్ తాలూకా అర్బన్ ఠాణాలో ఎస్టీ అదృశ్యం కేసు నమోదు చేయించి ఈనెల 1న Disha ఎస్సై దానమ్మ సిబ్బందితో పాటు శ్యామల, నాగరాజును వడోదరకు పంపారు. ఆస్పత్రి వైద్యులకు ఎఫ్ఐఆర్ను చూపించడంతో parul సేవాశ్రమం వారు శ్రీదేవిని అప్పగించారు. బుధవారం కర్నూలులో ఎస్పి మీడియా సమక్షంలో శ్రీదేవిని తండ్రికి అప్పగించారు. 75 ఏళ్ల వయసుకు చేరిన నాగిశెట్టి ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన కూతుర్ని చూసి పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
