ఒకరు ఆ యువతిని ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని  కూడా చెప్పాడు. అతను చెప్పిన మాటలను ఆ యువతి పూర్తిగా నమ్మేసింది. అతనికి శారీరకంగా  దగ్గరైంది. మరోవైపు.. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మరో యువకుడు సదరు యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు.

 తన కోరిక తీర్చకుంటే.. మీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ చెప్పేస్తాననా బెదిరించాడు. దీంతో... ఆ యువకుడికి కూడా యువతి లొంగిపోవాల్సి వచ్చింది. చివరకు యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత... ఇద్దరూ యువకులు మాకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ సంఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని రామలింగాపురం పంచాయతీ పరిధి పుర్రేయవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుర్రేయవలస గ్రామానికి చెందిన వివాహితుడు సంగిరెడ్డి రామారావు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. 

ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు బూటు పైడిరాజు ఆ యువతిని బెదిరించి వాంఛ తీర్చుకున్నాడు. ఆమె గర్భవతి కావడంతో ఇద్దరూ తమకు సంబంధం లేదంటూ తిరగడం మొదలుపెట్టారు. యువతి శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించిన కుటుంబసభ్యులు కుమార్తెను మందలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో.. యువతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని  గ్రామ పెద్దలకు తెలియజేశారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.