కాకినాడ: వివాహేతర సంబంధం హత్యకు దారి చేసింది. ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు సైకిల్ తాళం ఆధారంగా శాస్త్రీయ పరిశోధనతో పోలీసులు ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుదురులో జరిగిన ఆ హత్య కేసును పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. మృతుడిని రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పేపకాయల సతీష్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. 

కాకినాడ రూరల్ సర్కిల్ డీఎస్పీ భీమారావు ఆ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కరప మండలం నడకుదురు శివారులోని ఓ ఖాళీ స్థలంలో తుమ్మ చెట్టు పొదల్లో కాలిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాలిపోయిన మృతదేహానని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ నెల 19వ తేదీన బంధువులు మృతదేహం సతీష్ కుమార్ దని గుర్తించారు. 

మైక్ సెట్లు అద్దెకు ఇస్తూ రైస్ మిల్లులో సతీష్ కుమార్ నైట్ వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం పెద్దిరెడ్డి సునీతతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల క్రితం సతీష్ కుమార్ కు దీర్ఘకాలిక వ్యాధి సోకింది. దాంతో అతను కాకినాడ  జీజీహెచ్ లో చికిత్స పొందుతూ వస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. 

ఆ క్రమంలో సతీష్ కుమార్ రజకవీధికి చెందిన తోట అర్షవేణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సతీష్ కుమార్ కు ఉన్న వ్యాధి గురించి తెలియడంతో తన వద్దకు రావద్దని ఆమె చెప్పింది. మనస్తాపానికి గురై అతను మార్చి 3వ తేీదన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో అతను రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడు. 

అర్షవేణికి తరుచుగా ఫోన్ చేసి భర్తను, పిల్లలను వదిలేసి తనతో రావాలని వేధిస్తూ వచ్చాడు. దాంతో ఆమె తన అక్క నడకుదురుకు చెందిన ఐరెడ్డి రాజేశ్వరి సహాయం తీసుకుంది. వారిద్దరి అతని హత్యకు పథకం రచన చేశారు. ఈ నెల 15వ తేదీన అతన్ని నడకుదురుకు రప్పించారు. గ్రామంలోని పెట్రోల్ బంక్ లో రెండు లీటర్ల పెట్రోల్ ను ఖాళీ డ్రింక్ బాటిల్ లో ఓ వ్యక్తితో తెప్పించుకున్నారు. సతీష్ కుమార్ ను సంఘటనా స్థలానికి రప్పించారు. 

అక్కడ సతీష్ కుమార్ ను అర్షవేణి తన కాళ్లతో మర్మాంగాలపై పలుమార్లు తన్నింది. అతను విలవిలలాడుతూ కింద పడిపోయాడు. అతని గుండెలపై కూర్చుని మెడకు చున్నీ బిగించి అక్క రాజేశ్వరి సాయంతో చంపేసింది. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత హైదరాబాదు పారిపోయారు.

నిందితులు అర్షవేణిని, ఐరెడ్డి రాజేశ్వరిని నడకుదురులో ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు సంఘటనా స్థలం వద్ద లభించిన సైకిల్ తాళం వెల్ల గ్రామంలో హతుడి ఇంటి వద్ద ఉన్న సైకిల్ కు సరిపోలడంతో దర్యాప్తులో ముందడుగు పడింది. అక్కాచెల్లెళ్ల కాల్ రికార్డులు, వారు సంఘటన స్థలానికి వెళ్లేటప్పుడు పెట్రోల్ సంచీని తీసుకెళ్తున్న దృశ్యాలు, తిరిగి వచ్చేటప్పటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.