కొన్ని సంవత్సరాలపాటు భర్త పెడుతున్న వేధింపులు భర్తిస్తూనే ఉంది. ఇక ఆమెలో సహనం నశించింది. భర్తను హత్యచేయాలని ప్లాన్ వేసింది. కాగా.. ఆమెకు తనఅత్త పూర్తిగా సహకరించడం గమనార్హం. కోడలు కన్న కొడుకుని హత్య చేస్తుంటే ఆమె సహకరించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ మహాబూబ్‌బాషా (33) తాగివచ్చి భార్య షేక్‌ మాబుబీని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అడ్డు వస్తే తన తల్లి షేక్‌ మిస్కిన్‌బీను కూడా కొట్టేవాడు. గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మహబూబ్‌బాషా భార్య, తల్లితో ఘర్షణ పడి దాడికి పాల్పడ్డాడు.

 అప్పటికే భర్త ప్రవర్తనతో విసిగివేసారిన షేక్‌మాబుబీ రోకలి బండతో అతడి తలపై బాదింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మహబూబ్‌బాషా తల్లి మిస్కిన్‌బీ సైతం కోడలుకు సహకరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అత్త, కోడలిపై హత్యకేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.