ఆమెకు అప్పటికే పెళ్లై.. భర్త,  కుమార్తె కూడా ఉన్నారు. కానీ.. ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే.. ప్రియుడితో రాసలీలలకు ఆమెకు భర్త అడ్డుగా అనిపించాడు. దీంతో.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంతేకాకుండా అందరికీ అది సహజ మరణంగా చిత్రీకరించింది. అయితే.. రెండు వారాల తర్వాత కూతురి కి అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన రాజోలులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సఖినేటిపల్లి మండలం ఉయ్యూరు మెరకకు చెందిన ఉప్పు ప్రసాద్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ప్రశాంతితో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.  అయితే ప్రశాంతికి అదే ప్రాంతానికి చెందిన చొప్పల్ల శివతో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రశాంతి.. భర్తను హతమార్చాలని స్కెచ్ గీసింది. 

ప్రియుడు శివతో కలిసి ప్రసాద్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అనంతరం ఈ నెల 2వ తేదీన.. రాత్రి సమయంలో భర్తను తనకు సోడా కావాలి తెమ్మని అడిగింది. వెంటనే తేవడానికి ప్రసాద్ తన దుకాణానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన శివ... తన స్నేహితుడితో కలిసి ప్రసాద్ ని చంపేశాడు. అనంతరం కుర్చీలో ప్రసాద్ మృతదేహాన్ని కూర్చోపెట్టి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ ప్రశాంతి నానా హడావిడి చేసింది. సహజ మరణంగా భావించిన బంధువులు ఖననం చేశారు.

ఈ క్రమంలో ప్రసాద్ మరణించిన సుమారు 15 రోజుల తర్వాత ప్రశాంతి.. తన ప్రియుడు శివతో మాట్లాడుతుండగా.. ఆమె కుమార్తె వినేసింది.

దీంతో... తన తండ్రిది సహజ మరణం కాదని ఆమెకు తెలిసిపోయింది. దీంతో వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ప్రశాంతి- శివల మధ్య హత్యకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ బయటపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంతి, శివలను అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పారు.