వాళ్లిద్దరికీ పెళ్లయ్యింది. అయితే.. కొన్ని కారణాలతో విడిపోయారు. భర్తతో విడిపోయాక.. ఆమె తన ప్రియుడతో సహజీవనం చేస్తోంది. అయితే.. మాజీ భర్త ఆస్తి పై ఆమె కన్నుపడింది. అందుకోసం ప్రియుడి సహాయం తీసుకొని అంతమొందించింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ కి చెందిన దినేష్ కుమార్ సింగ్(45) 14 సంవత్సరాల క్రితం విజయవాడ వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తూ జీవించేవాడు. అతనికి భార్య చింతాసింగ్, కుమారులు సత్యం శివం, లక్ష దీప్ ఉన్నారు. కాగా.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం వారు విడిపోయారు.

పిల్లలకు మైనార్టీ తీరకపోవడంతో తల్లి వద్దే ఉంటున్నారు. అయితే... దినేష్ కుమార్ సింగ్ కి ప్రసాదంపాడులో ఒక సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పై అంతస్తులో పిల్లలు, కింద అంతస్తులో దినేష్ కుమార్ ఉండాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్లుగా అలానే ఉంటూ వస్తున్నారు.

అయితే... ఆమెకు భర్తతో విడిపోయాక మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో పిల్లలకు తెలీకుండా సహజీనవం చేస్తూ వస్తోంది. కాగా... ఈ క్రమంలో భర్త ఇంటిపై ఆమె కన్ను పడింది. ఆ ఇంటికి తాను దక్కించుకోవాలంటే భర్తను చంపేయడమే కరెక్ట్ అని భావించింది.

ఈ క్రమంలో ఇటీవల భర్త నిద్రపోతున్న సమయంలో ప్రియుడితో కలిసి వచ్చి దాడి చేసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి తనకేమీ తెలీనట్టు వెల్లిపోయింది. కాగా.. తర్వాతి రోజు దినేష్ కుమార్ సింగ్ చనిపోయి ఉండటాన్ని పిల్లలు గమనించారు. 

కుటుంబసభ్యులు బంధువులు.. ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరిపారు. ఈ క్రమంలో మాజీ భార్య తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.