ఏలూరు: ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా తన కూతురిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

గౌరీపట్నానికి ెచందిన మంగమ్మకు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామానికి చెందిన రవి కిరణ్ తో అక్రమ సంబంధం ఏర్పడింది. మంగమ్మ భర్త భీమరాజు కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు మగ పిల్లలు, ఓ కూతురు ఉంది. పదేళ్ల కూతురు భవానీ వికలాంగురాలు. 

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే కారణంతో మంగమ్మ ఆమె ప్రియుడు రవికిరణ్ కలిసి కూతురిని కర్రతో కొట్టింది. దాంతో భవానీ మరణించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఉంగుటూరు మండలం నల్లమాడు రెవెన్యూ పరిధిలో దూబచర్ల - చేబ్రోలు రహదారి పక్కన ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో పాతిపెట్టారు. 

నెల రోజుల నుంచి తన సోదరి భవానీ కనిపించకపోవడంతో అన్న రాజుకు అనుమానం వచ్చింది. సోదరి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మంగమ్మను, రవికిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు భవానీని వారే చంపినట్లు విచారణలో పోలీసులు ధ్రువీకరించుకున్నారు. భవానీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.