అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య.

అనంతపురం : క్షణకాలం సుఖంకోసం జీవితాంతం తోడూనీడగా వుండే కట్టుకున్న భర్తను కడతేర్చిందో కసాయి భార్య. మానవసంబంధాలకే మచ్చలాంటి ఈ అమానుషం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. భర్తను హతమార్చి అది సాదారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఆ ఇల్లాలు. అయితే తాజాగా ఆమె పాపం పండి ప్రియుడితో కలిసి కటకటాలపాలయ్యింది.

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా తుగ్గల్లి మండలం బాటతండాకు చెందిన ఈశ్వర్ నాయక్ ఉపాధినిమిత్తం కుటుంబంతో సహా అనంతపురం జిలా గుత్తిలో నివాసముండేవాడు. అతడు అటవీశాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో డ్రైవర్ గా పనిచేసేవాడు. విధుల్లో భాగంగా ఈశ్వర్ బయటే ఎక్కువగా వుండటంతో అతడి భార్య ఉమాదేవిబాయికి ఒంటరిగా వుండేది. ఈ క్రమంలోనే గుత్తి ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే కృష్ణయ్యతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 

Read More కాకినాడ జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

ఇటీవల భార్య అక్రమ సంబంధం గురించి తెలియడంతో ఈశ్వర్-రమాదేవి దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కృష్ణయ్యకు దూరంగా వుండాలని భార్యను హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోగా భర్తనే అడ్డుతొలగించుకునేందుకు సిద్దమయ్యింది. తమ అక్రమ బంధానికి అడ్డుగా వున్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది రమాదేవి.

గత ఆదివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త ఈశ్వర్ కు చికెన్ లో విషమిచ్చి చంపడానికి రమాదేవి ప్రయత్నించింది. అయితే ఈశ్వర్ మృతిచెందకపోవడంతో సోమవారం మరోసారి హత్యాయత్నం చేసింది. మద్యంమత్తులో వున్న భర్తను రోకలిబండతో బాదడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో వున్న భర్తను ఆమే హాస్పిటల్ కు తరలించింది. ఇంట్లో కాలుజారిపడ్డాడని అందరినీ నమ్మించింది. చికిత్స పొందుతూ ఈశ్వర్ మృతిచెందాడు. 

వదిన వివాహేతర సంబంధం గురించి ముందే తెలియడంతో ఈశ్వర్ సోదరుడు ఇంద్రసేనా నాయక్ ఆమెపైనే అనుమానం వ్యక్తంచేసాడు. సోదరున్ని వదినే చంపివుంటుందని అనుమానాన్ని పోలీసులతో వ్యక్తం చేసాడు. దీంతో పోలీసులు పరారీలో వున్న ఉమాదేవి, కృష్ణయ్య కోసం వెతుకుతుండగా నిన్న(శనివారం) ఇద్దరూ లొంగిపోయారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.